సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం నుంచి రెండ్రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 40 నుంచి 50 కి.మీ) కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండ్రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో అధిక ఉష్ణోగ్రతలతో పాటు చెదురుముదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
వివిధ ప్రాంతాలలో నమోదైన వర్షపాతం
హిందూమహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో నేడు పలు చోట్ల 2 నుంచి 3 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఘన్‌పూర్ (జనగాం) 3 సెం.మీ, చౌటుప్పల్(యాదాద్రి భువనగిరి) 2 సెం.మీ, నర్మెట్ట(జనగాం) 2 సెం.మీ, యాచారం(రంగారెడ్డి) 2 సెం.మీ, పాలకుర్తి(జనగాం) 2 సెం.మీ, యాదగిరి గుట్ట(యాదాద్రి భువనగిరి) 2 సెం.మీ, మర్రిగూడ(నల్గొండ) 2 సెం.మీ, బెజ్జంకి(సిద్దిపేట) 2 సెం.మీ, ధర్మసాగర్(వరంగల్ అర్భన్) 2 సెం.మీ, కాగజ్‌నగర్(కుమరం భీం) 2 సెం.మీ, మహబూబాబాద్ 2 సెం.మీ, జఫర్‌గఢ్(జనగాం) 2 సెం.మీ, వర్గల్(సిద్దిపేట) 1 సెం.మీ
30 వేల ఎకరాల్లో పంట నష్టం
అకాల వర్షాలు, వడగండ్ల వానలతో ఈ నెల 3 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలో దాదాపు 30 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసిందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నాలుగు రోజుల్లోనే 14,848 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. ఇందులో 95% అత్యధికంగా కోతదశకు వచ్చిన వరి పంటే ఉండటంతో చేతికి వచ్చిన పంట నీటి పాలైందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పంటల బీమా చేసుకున్న రైతులకు పరిహారం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్లకు, వ్యవసాయ, ఉద్యానాధికారులను ఆదేశిస్తూ లేఖ రాశారు. రైతులకు అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్లు ఉన్నాయని, వాటికి ఫోన్ చేసి కంపెనీలకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. బీమా కంపెనీల టోల్ ఫ్రీ నంబర్లు 18005992594, 18002095959 లకు ఫోన్లు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment