ఆర్టీసీ బస్సులో ఫుట్‌బోర్డుపై అడ్డంగా నిలబడి... ఓ ప్రయాణికుడి మెడలోని రెండు తులాల బంగారు గొలుసుతో ఉడాయించారు..
హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో ఫుట్‌బోర్డుపై అడ్డంగా నిలబడి... ఓ ప్రయాణికుడి మెడలోని రెండు తులాల బంగారు గొలుసుతో ఉడాయించారు కొందరు కేటుగాళ్లు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... శుక్రవారం సాయంత్రం 6గంటల ప్రాంతంలో అంబర్‌పేటకు చెందిన దాసరి శ్రీధర్ సాయంత్రం వేళ బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్ వద్ద బస్సు ఎక్కి పెన్షన్ ఆఫీసు వద్ద బస్సు దిగేందుకు ప్రయత్నించగా ఆరుగురు యువకులు ఫుడ్‌బోర్డుపై అడ్డుకున్నారు.
అందులో ఒక వ్యక్తి ఫిట్స్ వచ్చినట్లు నటించాడు. దాసరి శ్రీధర్ ఆ వ్యక్తిని పైకి లేపేందుకు ప్రయత్నించాడు. బస్సు ఆపడంతో ఇంతలోనే ఆ ఆరుగురు యువకులు పరారయ్యారు. అది గమనించిన శ్రీధర్ తన మెడలో చూసుకోగా రెండు తులాల బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో వెంటనే సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.