జేసీబీ సహాయంతో కారును చెరువులోనుంచి బయటకు తీస్తున్న స్థానికులు
రామన్నపేట: మహా శివరాత్రి సందర్భంగా సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. చెరువులో కారు కడగడానికి వెళ్లిన తండ్రి, కొడుకు, స్నేహితుడు జలసమాధి అయ్యారు. ఈ హృదయ విదారక ఘటన శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో వెలుగుచూసింది. రామన్నపేట మండలం సర్నేనిగూడెం గ్రామ సర్పంచ్ ధర్నె రాణి భర్త మధు (35) టీఆర్‌ఎస్ నాయకుడు. వీరికి కుమారుడు మణికంఠ (10), కుమార్తె అభినయ ఉన్నారు. శుక్రవారం శివరాత్రి సందర్భంగా కారును కడిగేందుకు ఉదయం 11 గంటల సమయంలో సర్నేనిగూడెంలోని తన ఇంటి నుంచి స్నేహితుడైన నన్నూరి శ్రీధర్‌రెడ్డి (25)తో కలిసి వెల్లంకిలోని మరో మిత్రుడి పొలంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు పయనమయ్యారు. పండుగ సందర్భంగా స్కూల్‌కు సెలవు కావడంతో కుమారుడు మణికంఠ కూడా వస్తానని మారాం చేయడంతో తండ్రి మధు వద్దని వారించాడు. తాత యాదయ్య మధుకి నచ్చజెప్పి మనవడిని తండ్రితో పాటు పంపించాడు.
ఈ క్రమంలో రాణి, ఆమె భర్త మధు, అత్తా మామలు అందరూ కలసి శుక్రవారం సాయంత్రం వెల్లంకిలోని శివాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయ బావి వద్ద ఉన్న వీరికి గుడికి వెళ్దామని ఇంటి నుంచి ఫోన్ రావడంతో సాయంత్రం 4.30 గంటల సమయంలో బావి వద్ద నుంచి ముగ్గురు కారులో బయలుదేరారు. అయితే కొద్దిసేపటికే వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. గుడికి వెళ్లడానికి ఆలస్యం అవుతుందని కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా వారి ఫోన్లు కలువ లేదు. రాత్రి వరకు ముగ్గురు తిరిగి రాకపోవడం, ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే వారి ఆచూకీ కోసం బంధువులు, స్నేహితులు ఇళ్లతో పాటు వ్యవసాయ పొలాల వద్ద వెతికినా లాభం లేకుండాపోయింది. శనివారం ఉదయం చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, సీఐ ఏవీ రంగా, ఎస్‌ఐలు సీహెచ్ సాయిలు, శివనాగప్రసాద్ సిబ్బందితో కలిసి వివిధ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలు, సెల్ టవర్ల నెట్‌వర్క్ (సీడీఆర్) ఆధారంగా ఆ ముగ్గురు స్థానిక ఈదుల చెరువు శివారులోనే అదృశ్యమైనట్లు గుర్తించారు.
చెరువులో జల సమాధి..: సీడీఆర్ ఆధారంగా ఫోన్ మాట్లాడిన కొద్దిసేపటికే సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడం, కారు కడిగిన బావికి 500 మీటర్ల దూరంలోనే చెరువు ఉండటంతో పోలీసుల దృష్టి సమీపంలోని ఈదుల చెరువుపై పడింది. అప్పటికే అక్కడికి చేరుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఏసీపీ, సీఐతో చర్చించారు. వెల్లంకికి చెందిన యువకుల సాయంతో ఈదుల చెరువులోకి దిగి కారు కోసం వెతికారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెరువు ఒడ్డు సమీపంలో కారు మునిగినట్లుగా గుర్తించారు. జేసీబీ సాయంతో కారును వెలికి తీసి అందులో ఉన్న ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.
కారు అదుపు తప్పడంతోనే..: బావి వద్ద నుంచి బయలుదేరిన కారు ఈదుల చెరువుపై నిర్మించిన కట్ట మీదకు రాగానే అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఇది ఎవరూ గమనించకపోవడంతో విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
తల్లిని ఓదార్చిన కుమార్తె..: భర్త అదృశ్యమై పుట్టెడు దుఃఖంలో ఉన్న మధు భార్య రాణిని ఆమె కుమార్తె అభినయ ఓదార్చిన తీరు కంటతడి పెట్టించింది. వెల్లంకి హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న అభియన.. తల్లి, బంధువులతోపాటు కారు కడిగిన వ్యవసాయ బావి వద్దకు వచ్చింది. తన భర్త, కుమారిడి ఆచూకీ చెప్పా లని కనిపించిన వారినల్లా గుండెలవిసేలా రోదిస్తూ అడుగుతుండటంతో.. నాన్న, తమ్ముడు క్షేమంగా తిరిగి వస్తారని, నువ్వు ఏడవద్దని తల్లిని ఓదార్చిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
సహాయక చర్యల్లో ఎమ్మెల్యే..: నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఘటనా స్థలాన్ని సందర్శించారు. సర్పంచ్ రాణిని ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం స్థానిక యువకులతో ఘటనా స్థలానికి వెళ్లి జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను బయటకు తీసిన అనంతరం పోస్టుమార్టం పూర్తయ్యే వరకు ఆస్పత్రిలోనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment