కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితా కూడా ఆ పార్టీ శ్రేణులతోపాటు మహాకూటమి భాగస్వామ్య పక్షాలను నివ్వెరపరిచింది. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఇంకా దేవరకొండ, మిర్యాలగూడ, తుంగతుర్తి స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. తొలి జాబితాలో చోటు దక్కని వారు మలి జాబితాకోసం ఎదురుచూశారు. కానీ, బుధవారం ప్రకటించిన రెండో జాబితాలోనూ ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో పాటే ఈ మూడింటిలో ఏ స్థానాన్ని ఏ పార్టీకి కేటాయిస్తున్నారో కూడా స్పష్టత లేదు. దీంతో అటు కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా, ఇటు కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐ, టీజేఎస్, ఇంటి పార్టీలు అయోమయంలో పడ్డాయి.
సాక్షిప్రతినిధి, నల్లగొండ: మహాకూటమిలో ఆ..మూడు స్థానాలపై చర్చ జరుగుతోంది. మొదటి, రెండు జాబితాల్లో కూటమి భాగస్వామ్య పక్షాలకు కాంగ్రెస్ ఒక్క సీటు కూడా కేటాయించలేదు. కాగా, జిల్లాలో ఒక్క స్థానం కూడా కూటమికి కేటాయించే అవకాశాల్లేవన్న వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ, సీపీఐ ఇప్పటికీ తమకు అవకాశం వస్తుందన్న ధీమాతో ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మూడు స్థానాలను ఇప్పటికే కేటాయించగా, సీపీఐ మాత్రం మరో స్థానాన్ని అదనంగా కోరుకుంటోంది. సీపీఐ డిమాండ్‌కు కాంగ్రెస్ తలొగ్గితే జిల్లాలోని దేవరకొండను కేటాయించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఈ స్థానంనుంచి గత ఎన్నికల్లో సీపీఐ పోటీచేసి గెలిచింది. ఆ ఎన్నికల్లో కూడా సీపీఐ, కాంగ్రెస్ పొత్తుపెట్టుకున్నాయి.
ఒక విధంగా దేవరకొండ సీపీఐకి సిట్టింగ్ స్థానం. ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన రవీంద్ర కుమార్ టీఆర్‌ఎస్‌లో చేరడంతోపాటు ఆయనిప్పుడు ఆ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాకుండా సీపీఐ ఆలేరు, మునుగోడులను కోరుకుంది. ఆ రెండు చోట్లా కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించింది. దీంతో అంతో ఇంతో ఆశ ఉన్నదంటే అది దేవరకొండ ఒక్కటే. మరి కాంగ్రెస్ ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయింస్తుందా..? లేదా.. ఒకవేళ తామే పోటీ చేయాలని భావిస్తే టికెట్ ఎవరికి దక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక్కడినుంచి పార్టీ ఇన్‌చార్జ్ జగన్ లాల్ నాయక్, బిల్యానాయక్, బాలునాయక్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న అంశంపై చివరకు దేవరకొండలో చిన్న చిన్న బెట్టింగులు కూడా మొదలయ్యాయి అంటే.. ఈ టికెట్‌పై ఎంతటి ఉత్కంఠ నెలకొందో అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్సా... టీజేఎస్సా ?
మిర్యాలగూడ స్థానం కూడా అన్ని వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇక్కడినుంచి సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు తెలంగాణ జనసమితి (టీజేఎస్) ఆశిస్తున్న స్థానాల్లోనూ ఇది ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి ఎనిమిది స్థానాలను ఇప్పటికే కేటాయించారు. అదనంగా తమకు మరొక స్థానం కావాలన్నది టీజేఎస్ డిమాండ్. ఆ అదనపు స్థానంగా మిర్యాలగూడ కావాలని కోరుతోంది. దీంతో ఈటికెట్‌పైనా ప్రతిష్టంభన ఏర్పడింది. ఒకవేళ రఘువీర్ రెడ్డికి టికెట్ ఇవ్వకుంటే ఆ అవకాశం తనకివ్వాలని అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి కోరుతున్నారు. ఇటీవలే ఆయన టీఆర్‌ఎస్‌నుంచి కాంగ్రెస్ గూటికి చేరారు. పార్టీకి చెందిన మరో సీనియర్ శంకర్ నాయక్ సైతం టికెట్‌పై ఆశ పెట్టుకున్నారు. ఈ కారణాల వల్లే మిర్యాలగూడ టికెట్‌పై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారని అంటున్నారు.
తేలని తుంగతుర్తి అభ్యర్థి..
తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి కూటమి లొల్లి ఏమీ లేకున్నా.. ఇక్కడ ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న పోటీ టికెట్ ప్రకటనపై ప్రభావం చూపుతోంది. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్ మరోమారు అవకాశం కోరుతున్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ రవి కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. టికెట్ పోటీ ఇప్పుడు వీరిద్దరి మధ్యే నెలకొంది. తుంగతుర్తి నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆర్.దామోదర్‌రెడ్డికి ఈ నియోజకవర్గంపై పట్టుంది. దీంతో ఆయన మద్దతు లేకుండా అభ్యర్థి బయట పడలేడన్న అభిప్రాయం ఉంది. దామోదర్‌రెడ్డి డాక్టర్ రవికి మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో అద్దంకి అభ్యర్థిత్వం పెండింగ్‌లో పడిందంటున్నారు.
కూటమి పక్షాల గుస్సా
మరోవైపు కూటమి భాగస్వామ్య పక్షాలు ఆగ్రహంగా ఉన్నాయి. కూటమిలోని సీపీఐ, టీడీపీ, టీజేఎస్, ఇంటి పార్టీలు కోరిన ఏ ఒక్క స్థానం ఏ పార్టీకి ఇవ్వలేదు. ఒకేసారి తొమ్మిది మంది తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మూడు స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఈ జాబితా ప్రకటన తర్వాత నివ్వెరపోవడం కూటమి పక్షాల వంతైంది. పూర్తి నిరాశలో ఉన్న టీడీపీ ఆయా స్థానాల్లో బరిలోకి దిగే ఆలోచనలో ఉంది. ఇప్పటికే ఆ పార్టీ దేవరకొండ నాయకుడు బిచ్యానాయక్ బుధవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. కోదాడలో టీడీపీ నేత బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ, హుజూర్‌నగర్ స్థానాల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు శ్రమించాలని టీడీపీ శ్రేణులను కోరారు. సీపీఐ తాము మునుగోడులో పోటీ చేస్తామని ప్రకటించింది. తెలంగాణ ఇంటి పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులకు కూటమి రెబల్స్ బెడద తప్పేలాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment