సాగునీటిశాఖలో రూ. 3,105 కోట్ల బిల్లుల పెండింగ్
సాక్షి, హైదరాబాద్: సాగునీటిశాఖ పరిధిలో ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లులన్నీ పేరుకు పోతున్నాయి. రాష్ట్ర ఆదాయం పెరిగినా, అదే స్థాయిలో ఇతర ప్రజా ప్రాయోజిత పథకాలకు నిధుల అవసరాలు గణనీయంగా పెరగడంతో ప్రాజెక్టు పనుల బిల్లులు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి.
ఇప్పటికే శాఖ పరిధిలో రూ.మూడు వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో పడటంతో కాంట్రాక్టు ఏజెన్సీలన్నీ శాఖ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రూ. 25 వేల కోట్ల కేటాయింపులు చేశారు. ఇందులో ఇప్పటి వరకు రూ. 10,538 కోట్ల మేర పనులు జరిగినట్లు నీటిపారుదల రికార్డులు చెబుతున్నాయి. ఈ నెలాఖరుకు గరిష్టంగా మరో రూ. రెండు నుంచి రూ. మూడు వేల కోట్లు ఖర్చు చేసే అవకాశాలున్నాయి.
అధిక బడ్జెట్ కేటాయించినా..
మొత్తం బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకే అధిక బడ్జెట్ కేటాయించినా, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లకే రూ. ఆరు వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావడం, ఇతర సంక్షేమ పథకాలకు భారీగా నిధులు వెచ్చించడంతో నీటిపారుదలశాఖకు అనుకున్న మేర నిధులు విడుదల కాలేదు. ప్రస్తుతం జరిగిన పనుల్లోనూ రూ. 3,105.67 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో భారీ ప్రాజెక్టుల పరిధిలోనే ఏకంగా రూ. 2,680.91 కోట్ల బిల్లులు పేరుకుపోయాయి.
ఇందులో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో రూ. 1,461 కోట్లు, పాలమూరు పరిధిలో రూ. 252 కోట్లు, కల్వకుర్తి పరిధిలో రూ. 150 కోట్లు, దేవాదుల పరిధిలో రూ.160 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక చెరువుల పునరుద్ధరణకు సంబంధించి సైతం రూ. 395.44 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లుల చెల్లింపునకు సంబంధించి కాంట్రాక్టు ఏజెన్సీలు ఇప్పటికే శాఖ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. కొన్నిచోట్ల బిల్లులు ఇవ్వని పక్షంలో పనులు నిలిపివేస్తామనే హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్నది ప్రస్తుతం కీలకంగా మారింది.