బాబోయ్.. మళ్లీ పులి | Tiger in Goats farm house | Sakshi
Sakshi News home page

బాబోయ్.. మళ్లీ పులి

Published Mon, Nov 24 2014 12:03 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Tiger in Goats farm house

సంగారెడ్డి రూరల్: మళ్లీ పులి కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ ఆందోళన కలిగించింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్ శివారులోని మేకల ఫామ్‌హౌస్‌లో దూరేందుకు శనివారం రాత్రి ప్రయత్నించింది. అకస్మాత్తుగా రాత్రివేళ కుక్కలు అరువడం, మేకలు చెల్లాచెదురుకావటంతో ఫామ్‌హౌస్‌లో పనిచే సే సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఏం జరుగుతుందని పెద్దలైట్లతో వెతకగా ఎదురుగా ఒక పెద్ద పులి, మరో రెండు చిన్న పులి పిల్లలు కనిపించాయి.

దీంతో భయాందోళనకు గురైన ఫామ్‌హౌస్ నిర్వాహకుడు చంద్రశేఖర్ యాదవ్ మిగతా సిబ్బందితో కలిసి రేకులతో పెద్దపెట్టున చప్పుళ్లు చేయటంతోపాటు మంటలు వేయడంతో పులులు భయపడి పారిపోయాయి. ఆదివారం ఉదయమే ఈ విషయాన్ని ఫామ్‌హౌస్ యజమాని నరహరిరెడ్డి అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. అటవీ శాఖ రేంజ్ డిప్యూటీ ఆఫీసర్ అనురాధ ఆధ్వర్యంలో సిబ్బంది ఇంద్రకరణ్ శివారులోని నరహరిరెడ్డి ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు.

చుట్టుపక్కల ప్రాంతాలు కలియ తిరిగిన అటవీశాఖ అధికారులు ఫామ్‌హౌస్ పక్కనే ఉన్న చిమ్నాపురం మల్లారెడ్డి  చెరకు తోటలో పులి అడుగుజాడలు గుర్తించారు. పెద్ద పులితోపాటు చిన్న పులిపిల్లల అడుగుజాడలు పసిగట్టిన వారు నమూనాలను సేకరించారు. పులి అడుగుజాడలు ఉన్న నేపథ్యంలో ఇంద్రకరణ్ పరిసర ప్రాంతాల్లో మూడు పులులు సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. పులులను బంధించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని సంఘటనా స్థలానికి వచ్చిన అటవీశాఖ అధికారి అనురాధ తెలిపారు. పులులను పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం అటవీశాఖ జిల్లా అధికారి కృష్ణమూర్తి ఇంద్రకరణ్ శివారులో పర్యటించి పులుల సంచారం గురించి వివరాలు సేకరించి తదుపరి చర్యలపై ఆదేశాలు జారీ చేస్తారని చెప్పారు.

పులి అడుగుజాడలు ఉన్న ప్రాంతానికి వచ్చిన  సంగారెడ్డి తహశీల్దార్ గోవర్ధన్ పులి సంచారం విషయమై అటవీశాఖ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. పులుల సంచారం నేపథ్యంలో మండలంలోని గ్రామాల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రి వేళల్లో ప్రజలు బయటకు వెళ్లవద్దని, పొలాల్లో సంచరించొద్దని కోరారు. రైతులు, ప్రజలు భయాందోళనకు గురికావద్దని పులులను పట్టుకునేందుకు అవసరమైన  చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇదిలా ఉంటే పదిహేను రోజుల క్రితం సంగారెడ్డి మండలంలోని కలివేముల శివారులో కనిపించి మాయమైన పులి మళ్లీ రావటంతో గ్రామాల్లోని ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు.

పదిహేను రోజుల క్రితం కలివేముల గ్రామంలో పులి కనిపించటంతో ప్రజలు విషయాన్ని కలెక్టర్ రాహుల్ బొజ్జా దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన కలెక్టర్ రాహుల్ బొజ్జా అటవీశాఖ అధికారులను రప్పించి పులిని పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేయించారు. అయి తే పులి బోనుకు చిక్కలేదు. దీంతో రైతులకు కనిపించిన పులి ఎక్కడికో వెళ్లిపో యి ఉంటుందని అటవీశాఖ అధికారు లు భావించారు. అయితే నాడు ఒక్క పు లి ఉందని రైతులు చెబితే నేడు మూడు పులులు ఉన్నట్లు నిర్ధారణ కావటంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే పులులను బంధించాలని కోరుతున్నారు.

భయసింది: చంద్రశేఖర్ యాదవ్
అర్ధరాత్రి వేళ ఒకటి కాదు మూడు పులు లు కనబడటంతో భయపడ్డానని ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న చంద్రశేఖర్ యాదవ్ తెలిపారు. అర్ధరాత్రి వేళ మేకలు, కుక్కలు అరవటంతో నిద్రలో నుంచి మేల్కొని బయటకు రాగా ఫెన్సింగ్ వద్ద పులులు అరుస్తూ కనబడ్డాయన్నారు. దీంతో అప్రమత్తమై లైట్లు కట్టివేసి తమ సిబ్బందితో కలిసి రేకులు గట్టిగా కొడు తూ చప్పుడు చేయటంతో  భయపడి పారిపోయాయన్నారు. తమ ఫామ్‌హౌస్ చుట్టూ పులులు సంచరిస్తుం డడంతో కొంత భయంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement