పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దుచేయాలని, ఆ మండలాలను తెలంగాణలోనే ఉంచాలని కోరుతూ ఈ నెల 10న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కువద్ద ధర్నా చేయనున్నట్టు తెలంగాణ జేఏసీ ప్రకటించింది.
హైదరాబాద్: పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలిపే ఆర్డినెన్స్‌ను రద్దుచేయాలని, ఆ మండలాలను తెలంగాణలోనే ఉంచాలని కోరుతూ ఈ నెల 10న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కువద్ద ధర్నా చేయనున్నట్టు తెలంగాణ జేఏసీ ప్రకటించింది. జేఏసీ కోచైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన ముఖ్యనేతలు హైదరాబాద్‌లోని జేఏసీ కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. అనంతరం లక్ష్మయ్య సి.విఠల్, కారెం రవీందర్ రెడ్డి, మణిపాల్‌రెడ్డి, పిట్టల రవీందర్, రంగరాజు తదితరులు విలేకరులతో మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ఆదివాసీలను ముంచేయడం సరికాదన్నారు. కేంద్రం తెచ్చిన ఈ ఆర్డినెన్సును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. 10 వ తేదీన జరిగే ధర్నాలో అన్ని రాజకీయపార్టీలు పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా ఆదివాసీ జేఏసీ ఈ నెల 14న ఢిల్లీలో తలపెట్టిన నిరసన దీక్షలోనూ జేఏసీ పాల్గొంటుందని వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన సమయంలో స్థానికతను ఆధారంగా తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారని వారు హెచ్చరించారు.