నేడు కాంగ్రెస్ ధర్నా | today congress dharna | Sakshi
Sakshi News home page

నేడు కాంగ్రెస్ ధర్నా

Published Fri, Sep 12 2014 1:48 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

నేడు కాంగ్రెస్ ధర్నా - Sakshi

నేడు కాంగ్రెస్ ధర్నా

వరంగల్: టీఆర్‌ఎస్ వంద రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఒక్క పథకం కూడా అమలుకు నోచుకోలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనను నిరసిస్తూ టీపీసీసీ పిలుపు మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు హన్మకొండ ఏకశిలపార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. హన్మకొండలోని డీసీసీ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో రైతుల ఆక్రందనలు, ఆత్మహత్యలు పెరిగాయని, రోజుకో కొత్త పథకాలు ప్రకటించి నాలుగు రోజులు హడావుడి చేయడం తప్ప.. ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
 
ప్రజలకేమైనా చేస్తారేమోనని వంద రోజులు వేచి చూశామని చెప్పారు. రుణమాఫీ, కరెంట్ సమస్యలను లేవనెత్తితే లాఠీచార్జి చేశారని విమర్శించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులపై కేసులు ఎత్తివేసే తీరిక ఈ ప్రభుత్వానికి లేక పోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు నిమిషాలకే ఉచిత విద్యుత్, పెన్షన్‌లు అమలు చేసిన ఘనత ఉందన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని టీఆర్‌ఎస్ నాయకులు.. కాంగ్రెస్ నేతలను బ్లాక్‌మెయిల్ చేస్తూ, కేసులు నమోదు చేస్తామంటూ లొంగదీసుకుంటున్నారని మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తానని, లేకుంటే తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన హామీని ఆయన సెల్‌పోన్‌లో వినిపించారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని, హిట్లర్‌లా వ్యవహరిస్తూ అహంకారంతో మాట్లాడుతున్నారని చెప్పారు. తొటి మంత్రులు హామీలిచ్చినా ఎద్దేవా చేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు వెనుకాడబోమని, కేసులకు భయపడేది లేదన్నారు.
 
తాము చేపట్టే ధర్నాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వ తీరుపై ప్రజలను చైతన్యం చేసేందుకు ఈ నిరసన చేపట్టినట్లు వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు ఈవీ శ్రీనివాసరావు, నమిండ్ల శ్రీనివాస్, పులి సాంబరాజు, బిన్ని లక్ష్మణ్, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement