నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ
తొలిసారి సీఎం హోదాలో అసెంబ్లీకి కేసీఆర్
మండలి చైర్మన్‌గా నేతి విద్యాసాగర్‌లతో ప్రమాణం చేయించనున్న గవర్నర్
నేడే మండలి సమావేశం కూడా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చట్ట సభల తొలి సమావేశాల చరిత్రాత్మక ఘట్టానికి సోమవారం తెరలేవనుంది. అధికారికంగా తెలంగాణ ఏర్పడిన వారం రోజుల్లోనే చట్టసభలు కొలువుదీరుతున్నాయి. సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన శాసనసభ్యులతోపాటు, తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటైన శాసనమండలి సభ్యులు సైతం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుండగా.. అంతకు గంటన్నర ముందు.. శాసనమండలి చైర్మన్‌గా ప్రస్తుత వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు, శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ శాసనసభ్యుడు కుందూరు జానారెడ్డితో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. వారి ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత శాసనసభ, శాసనమండలి ప్రారంభం అవుతాయి. శాసనసభ సభ్యులతో ప్రొటెం స్పీకర్ జానారెడ్డి, మండలి సభ్యులతో చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించనున్నారు.
పదేళ్ల తరువాత సభకు కేసీఆర్..
టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పదేళ్ల తరువాత తిరిగి శాసనసభకు హాజరవుతున్నారు. డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులతోపాటు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కేసీఆర్, ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సభ్యునిగా సభలోకి అడుగుపెట్టారు. 2004కు ముందు కేసీఆర్, మరో నేత పాపారావు టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 2004 ఎన్నికల్లో చంద్రశేఖర్‌రావు కరీంనగర్ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి కేంద్ర ప్రభుత్వంలో చేరడం, 2009 ఎన్నికల్లోనూ ఆయన మహబూబ్‌నగర్ పార్లమెంట్ సీటుకు పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. పదేళ్లు పార్లమెంట్ సభ్యునిగా కొనసాగిన కేసీఆర్ 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను విజయపథంలో నడిపించి తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ముఖ్యమంత్రి హోదాలో శాసనసభకు హాజరు కానున్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు ఎనిమిదిన్నర సంవత్సరాలపాటు మం త్రిగా బాధ్యతలు నిర్వహించిన జానారెడ్డి ఈసారి ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించనున్నారు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో మొన్నటి వరకు 295 మంది సభ్యులు (నామినేటెడ్ సభ్యురాలుసహా) ఉంటే.. రాష్ట్రం విడిపోయిన తరువాత 119 మంది సభ్యులతో తెలంగాణ శాసనసభ కొలువుదీరనుంది. అదే విధంగా 90 మంది ఎమ్మెల్సీలు ఉన్న శాసనమండలి, రాష్ట్ర విభజన అనంతరం 40 మంది సభ్యులతో కొనసాగనుంది. అందులో ప్రస్తుతం 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
10న స్పీకర్ ఎన్నిక..
శాసనసభ రెండోరోజున సభ్యులు స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఈనెల 11వ తేదీన 11 గంటలకు గవర్నర్ నరసింహన్ తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం తరువాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరుగుతుంది. 12వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. శాసనసభ వ్యవహారాల కమిటీలో ప్రతిపక్షాలు మరోరోజు గడువు పొడిగించాలని పట్టుపట్టే పక్షంలో, ప్రభుత్వం అంగీకరిస్తే ఈనెల 13వ తేదీ వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
భద్రతకు రెండున్నర వేల మంది ఖాకీలు..
హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సమావేశాలు జరగనున్న అసెంబ్లీ కొత్త భవనం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సుమారు రెండున్నర వేల మంది పోలీసులను భద్రత కోసం నియమించారు. ఇందులో సివిల్ పోలీసులతో పాటు 22 ప్లాటూన్ల తెలంగాణ స్పెషల్ పోలీసు బెటాలియన్ బలగాలు, రెండు సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సు బలగాలు, ఒక బీఎస్‌ఫ్ కంపెనీని వినియోగిస్తున్నారు. అసెంబ్లీ రెండు ప్రధాన గేట్ల వద్ద అదనపు ఎస్పీ స్థాయి అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించారు. అసెంబ్లీ లాబీతో పాటు గ్యాలరీలోకి వెళ్లే ప్రధాన ద్వారా వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి, పాసులు ఉంటేనే లోనికి అనుమతించాలని ఆదేశించారు. గన్‌పార్కు వైపు నుంచి అసెంబ్లీ వైపు వచ్చే మార్గం మొదలుకొని అసెంబ్లీ ప్రధాన గేటు, లాబీ, గ్యాలరీ, అసెంబ్లీ ప్రాంగణంలో క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు భద్రతా గది నుంచి టీవీల ద్వారా పరిసరాలను పర్యవేక్షించనున్నారు.