ట్రా‘ఫికర్‌’ తగ్గింది.. ‘స్పీడ్‌’ పెరిగింది | Traffic Problem solve in Peak Times Hyderabad | Sakshi
Sakshi News home page

చలొరె..చలొరె..చల్‌!

Published Sat, Dec 9 2017 7:47 AM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

Traffic Problem solve in Peak Times Hyderabad - Sakshi

మెట్రో రైలుతో నగరంలో కాస్త ట్రా‘ఫికర్‌’ తగ్గింది. వాహనాల సగటు వేగం పెరిగింది. పీక్‌ అవర్‌లో జనం రయ్‌..రయ్‌ అని దూసుకెళ్తున్నారు. గతంలో 12 కేఎంపీహెచ్‌ ఉన్న వాహన వేగం 20కి పెరిగింది. మరోవైపు ఆర్టీసీలో ఒక శాతం ఆక్యుపెన్సీ తగ్గింది. ఆటోలు, క్యాబ్‌లపైనా మెట్రో ప్రభావం చూపింది. ఇక ఈ రెండు రూట్లలో వ్యక్తిగత వాహనాలు వినియోగించే వారి సంఖ్య దాదాపు 60 వేల వరకు తగ్గినట్లు అంచనా. ఇటీవల మైట్రో రైలు రాకపోకలు ప్రారంభమైన నాగోల్‌–అమీర్‌పేట, మియాపూర్‌–అమీర్‌పేట మార్గాల్లో శుక్రవారం ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన జరపగా ఈ విషయాలు వెల్లడయ్యాయి.

సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్‌/మూసాపేట్‌: గ్రేటర్‌వాసుల కలల మెట్రో ప్రభావంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ కష్టాలు తొలిగాయి. దీంతో మొన్నటివరకు నత్తనడకన సాగిన వాహనాలు ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ప్రధానంగా నాగోల్‌–అమీర్‌పేట్‌(17 కి.మీ)మార్గంలో ఉదయం, సాయంత్రం పీక్‌ అవర్స్‌లో రోడ్డుమార్గంలో ప్రయాణానికి 50 నుంచి 60 నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు ప్రయాణ సమయం 33 నిమిషాలు మాత్రమే. ఇక మియాపూర్‌–అమీర్‌పేట్‌ (13 కి.మీమార్గం)లోనూ పీక్‌అవర్స్‌లో రోడ్డుమార్గంలో ప్రయాణానికి 50 నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు 30 నిమిషాల్లో గమ్యం చేరుకోవచ్చు. ఇదెలా సాధ్యమైందనుకుంటున్నారా...మెట్రో రాకతో కలల రైళ్లలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఈ ప్రభావంతో మొత్తంగా కాకపోయినా..మెట్రో రూట్లలో సుమారు 60 వేల వ్యక్తిగత వాహనాల (ద్విచక్రవాహనాలు, కార్లు) వినియోగం తగ్గుముఖం పట్టినట్లు మెట్రో, ట్రాఫిక్‌ అధికారులు ప్రాథమికంగా అంచనావేస్తున్నారు. ఇక మొన్నటివరకు నగరంలో సగటు వాహనవేగం 12 కేఎంపీహెచ్‌ ఉండేది. ఇప్పుడు మెట్రో రాకతో సగటు వాహనవేగం 20 కేఎంపీహెచ్‌కు పెరిగిందని చెబుతున్నారు. మెట్రో రూట్లలో రాకపోకలు సాగిస్తున్న ఆర్టీసీకి చెందిన 80 ఫీడర్‌ బస్సులు, మరో వెయ్యి ఆర్టీసీ రెగ్యులర్‌ సర్వీసుల్లోనూ సరాసరిన ఒకశాతం ఆక్యుపెన్సీ(ప్రయాణికుల భర్తీశాతం)తగ్గినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతుండడం విశేషం. ఇక ఈ రెండురూట్లలో సుమారు ఐదువేల వరకు ఆటోలు, క్యాబ్‌ల రాకపోకలు కూడా తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ వత్తిడి తగ్గి సిటీజన్లు ఊపిరి పీల్చుకుంటున్నట్లు ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. శుక్రవారం రెండు మెట్రో రూట్లలో పరిశీలించగా ఈ విషయం సుస్పష్టమైంది.

ఈ ప్రాంతాల్లో ట్రాఫికర్‌ బాగా తగ్గింది...
ప్రధానంగా సీఎం క్యాంపుకార్యాలయం, అమీర్‌పేట్, మైత్రీవనం, బేగంపేట్, రసూల్‌పురా ప్రాంతాల్లో ట్రాఫికర్‌ గణనీయంగా తగ్గడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యక్తిగత వాహనాలతోపాటు బస్సులు, కార్లలో వెళ్లే వారు సాఫీగా సాగుతుండడం విశేషం.

రూట్‌–1
నాగోల్‌–అమీర్‌పేట్‌ రోడ్డు ప్రయాణం ఇలా..
సమయం: శుక్రవారం ఉదయం 10:17 నిమిషాలు  
బైక్‌ ప్రయాణం ప్రారంభం: నాగోల్‌ మెట్రో స్టేషన్‌
రూట్‌: నాగోల్‌–ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌ల నుంచి తార్నాక, మెట్టుగూడ, రైల్‌ నిలయం, బేగంపేట, లైఫ్‌స్టైల్‌–ప్రకాశ్‌నగర్‌ మీదుగా అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ చేరడానికి పట్టిన సమయం కేవలం 33 నిమిషాలు. వారం క్రితం 50 నుంచి 60 నిమిషాల సమయం పట్టేది. ఇక మెట్రోరైలులో ఈ రూట్లో ప్రయాణానికి 30–35 నిమిషాల సమయం పడుతోంది.

రూట్‌–2
మార్గం: మియాపూర్‌–అమీర్‌పేట్‌
సమయం: ఉదయం 9.00 గంటలు
బైక్‌ ప్రయాణం ప్రారంభం:మియాపూర్‌ మెట్రో స్టేషన్‌
మార్గం: మియాపూర్‌–జేఎన్‌టీయూ–కెపిహెచ్‌బి–కూకట్‌పల్లి–బాలానగర్‌–మూసాపేట్‌–భరత్‌నగర్‌–ఎర్రగడ్డ–ఈఎస్‌ఐ–ఎస్‌.ఆర్‌.నగర్‌–అమీర్‌పేట్‌కు చేరడానికి 30 నిమిషాల సమయం పట్టింది. అంటే 9.30కు అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ చేరుకోవచ్చు.  
గతంలో ఇలా: ఈ మార్గంలో ద్విచక్ర వాహనంపై గతంలో ప్రయాణానికి 50 నిమిషాల సమయం పట్టేది.మెట్రో రైలులో 20–23 నిమిషాల సమయం పడుతోంది. మెట్రో రాకతో ఈ రూట్లో బైక్‌ ప్రయాణం సుమారు 20 నిమిషాలు తగ్గినట్లే.

ఇది శుభపరిణామం
తొలిదశ మెట్రో ప్రారంభమైన నాగోల్‌–అమీర్‌పేట్, మియాపూర్‌–అమీర్‌పేట్‌ మార్గంలో మొత్తంగా వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గి ట్రాఫిక్‌ తగ్గుముఖం పట్టడం శుభపరిణామం. ఈ రూట్లలో ప్రధాన రహదారులపై వాహనాల సగటు వేగం గణనీయంగా పెరిగినట్లు మా పరిశీలనలో తేలింది. ఎస్పీరోడ్‌–బేగంపేట్, అమీర్‌పేట్‌–పంజగుట్ట మార్గంలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ తగ్గుముఖం పట్టడంతో సిటీజన్లు ఊపిరిపీల్చుకుంటున్నారు.   – ఎన్వీఎస్‌రెడ్డి, హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ

రిలీఫ్‌గా ఉంది...
ఉప్పల్‌ నుంచి మెట్టుగూడ వరకు 40 శాతం ట్రాఫిక్‌ తగ్గింది. సికింద్రాబాద్‌ నుంచి అమీర్‌పేట వరకు 20 శాతం ట్రాఫిక్‌ తగ్గింది. ప్రతి నిత్యం ఉప్పల్‌ నుంచి హైటెక్‌సిటీ వరకు ద్విచక్ర వాహనంపైనే వెళ్తున్నాను. మెట్రో వచ్చిన నాటి నుంచి ట్రాఫ్రిక్‌ సమస్య తీరింది. రోజు  వారిగా దాదాపుగా 15 నుంచి 20 నిమిషాలు జర్నీ సమయం తగ్గింది. రిలీఫ్‌గా ఉంది. – నూతన్‌ కుమార్‌ కంచుపు,  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, సైబర్‌సిటి

రోడ్లపై రద్దీ తగ్గింది...
దాదాపుగా 25 నుంచి 35 శాతం తార్నాక నుంచి కూకట్‌పల్లి వరకు ట్రాఫిక్‌ తగ్గింది. ద్విచక్ర వాహనం ప్రయాణం గతంలో నరకంగా ఉండేది. ప్రస్తుతం అంత ఇబ్బందిగా అనిపించడం లేదు.
– భరత్‌రెడ్డి, తార్నాక, హైటెక్‌ సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

గతంతో పోల్చితే బెటర్‌
గత నాలుగైదు రోజుల నుంచి రోడ్లపై జాలీగా ఉద్యోగానికి వెల్తున్నాను. ట్రాఫిక్‌ బాగా తగ్గింది. డ్రైవింగ్‌ చాలా ఈజీగా ఉంది. వేగం 30 దాటక పోతుండేది. ప్రస్తుతం 60 దాటుతుంది.  -రాజేష్, సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌

ఈజీ జర్నీ...
తార్నాక నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు కారులో వెల్తుంటాను. గత నాలుగైదు రోజుల నుండి రోడ్లపై ట్రాఫిక్‌ కాస్త తగ్గినట్లు అనిపించింది. ముఖ్యంగా మెట్టుగూడ నుండి సిక్రింద్రాబాద్‌ వరకు ట్రాఫిక్‌ కదలకుండా ఉండేది. ఇప్పుడు ఈజీగా వెళ్తున్నాం.   -జోయల్, రైల్వే ఉద్యోగి

మెట్రో జర్నీ బాగుంది...
కూకట్‌పల్లి నుంచి మియాపూర్‌ వరకు కళాశాలకు వెళ్తుంటాను. గతంలో బైక్, బస్సుపై వెళ్లేవాడిని. కానీ మెట్రో రైలు ప్రారంభం నుంచి రైలులో వెళ్తున్నాను. జర్నీ సూపర్‌గా ఉంది. ట్రాఫిక్‌ సమస్య లేదు. పొల్యుషనూ లేదు. –గోస్వామి, విద్యార్థి, కూకట్‌పలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement