
రైలు ఆలస్యం.. అందుకే ప్రమాదం!
మృత్యువు ముంచుకొచ్చింది. రైలు రూపంలో తరుముకుని వచ్చింది. అదే దాదాపు 20 మంది చిన్నారుల ప్రాణాలు బలిగొంది. వాస్తవానికి నాందేడ్ ప్యాసింజర్ ప్రమాదం జరిగిన సమయానికి రావాల్సింది కాదు. నాలుగు గంటలు ఆలస్యంగా ఆ రైలు నడుస్తోంది. దాదాపు ప్రతిరోజూ అదే మార్గంలో ప్రయాణించే బస్సులు, ఇతర వాహనాల డ్రైవర్లకు రైళ్ల రాకపోకల సమాచారం తెలుస్తూనే ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో రైళ్లేవీ రావన్న ధైర్యంతోనే బస్సు డ్రైవర్ కూడా మొండిగా ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది.
కానీ నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తున్న నాందేడ్ ప్యాసింజర్.. బస్సు వస్తున్న విషయాన్ని తెలుసుకునే అవకాశం లేకపోవడం, క్రాసింగ్ వద్దకు రైలు వచ్చేసరికి ఎదురుగా ఉన్నట్టుండి బస్సు కనిపించడంతో రైలు డ్రైవర్ కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రైలుకు షడన్ బ్రేకు వేస్తే.. వెనక ఉన్న 14 బోగీలు పట్టాలు తప్పి, మరింత ఘోరమైన ప్రమాదం సంభవిస్తుంది. అందుకే నెమ్మదిగా బ్రేకులు వేస్తూ.. దాదాపు అర కిలోమీటరు దూరం తర్వాతే రైలును ఆపగలిగాడు. దాంతో అంతదూరం పాటు బస్సును రైలు లాక్కుంటూ వెళ్లిపోయింది. బస్సు మీద, రైలు పట్టాల మీద పిల్లల రక్తపు మరకలు పడ్డాయి.