మహబూబ్ నగర్ : ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట విద్యుత్తు ఏడీఈ కామేశ్వర్‌రావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రాందాస్‌తేజ కథనం ప్రకారం..పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన ఆవుల శ్రీశైలం 2012లో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ కోసం డీడీ చెల్లించాడు. ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు కాలేదు. అయితే, సదరు డీడీ తాలూకు రసీదు ఎక్కడో పోయింది.
కొన్నాళ్ల క్రితం ట్రాన్స్‌ఫార్మర్ కోసం శ్రీశైలం కొత్తకోటలో ఏడీఈ కామేశ్వర్‌రావును కలిశాడు. రూ.30వేలు ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేస్తానని పట్టుబట్టాడు. ఈ క్రమంలో ఇటీవల రూ.10వేలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఏడీఈ పై నిఘా వేశారు. బుధవారం కొత్తకోటలో రైతు నుంచి రూ.6 వేలు తీసుకుంటుండగా కామేశ్వర్‌రావును అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ సిబ్బంది రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
(కొత్తకోట)