చిరకాల ప్రత్యర్థుల తాజా పోరు జిల్లాలో ఆసక్తిగా మారింది. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా గత ఎన్నికల్లో పోటీపడ్డ అభ్యర్థులే మరోసారి వివిధ పార్టీల తరఫున బరిలోకి నిలవడం విశేషం. ఇందులో రామగుండం, పెద్దపల్లిల్లో పోటీ త్రిముఖం కాగా, ప్రత్యేకతను సంతరించుకున్న మంథనిలో ముఖాముఖి పోటీ నెలకొంది.
సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లిలో రెండో విజయం కోసం మాజీ ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి తలపడుతున్న దాసరి మనోహర్‌రెడ్డి, చింతకుంట విజయరమణారావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కావడం విశేషం. వీరంతా ఇప్పటి వరకు ఒక్కోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది, రెండో విజయం కోసం తహతహలాడుతున్నారు. దాసరి మనోహర్‌రెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే కాగా, ఆయన మరోసారి టీఆర్‌ఎస్ నుంచి పోటీపడుతున్నారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన చింతకుంట విజయరమణారావు ఈసారి కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచారు. బీజేపీ ఎమ్మెల్యేగా పెద్దపల్లి నుంచి గతంలో గెలిచిన గుజ్జుల రామకృష్ణారెడ్డి మరోసారి అదే పార్టీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నియోజకవర్గంలో 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా, ప్రధాన పోటీ మాత్రం ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల నడుమనే కొనసాగనుంది. కొత్త జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేల ఫైట్‌ను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
మంథనిలో నువ్వా.. నేనా !
రాష్ట్రంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న మంథనిలో చిరకాల ప్రత్యర్థుల మరోపోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒకప్పటి సన్నిహితులు, ఆ తరువాత ప్రత్యర్థులు మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తాజామాజీ ఎమ్మెల్యే పుట్ట మధు వరుసగా మూడోసారి తలపడుతున్నారు. ఇప్పటి వరకు ఇరువురు రెండుసార్లు పోటీపడగా, చెరోమారు విజయం సాధించడం గమనార్హం. గత ఎన్నికల తరహాలోనే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాంగ్రెస్ నుంచి, పుట్ట మధు టీఆర్‌ఎస్ నుంచి బరిలోకి దిగారు. నియోజకవర్గంలో మొత్తం పది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ చిరకాల ప్రత్యర్థులు శ్రీధర్‌బాబు, మధుల మధ్యే పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాంగ్రెస్ రాష్ట్రస్థాయి నేత కావడంతో ఈ పోటీ రాష్ట్ర వ్యాప్తంగా ఆకర్షిస్తుంది. బీజేపీ నుంచి సనత్‌కుమార్ పోటీ చేస్తున్నారు.
రామగుండంలో త్రిముఖం
రామగుండం నియోజకవర్గంలో పాత ప్రత్యర్థుల పోరు మరోసారి కొనసాగుతుంది. గత ఎన్నికల్లో తలపడిన అభ్యర్థులే ప్రస్తుతం వివిధ పార్టీల తరఫున పోటీలోకి దిగారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన సోమారపు సత్యనారాయణ మరోసారి అదే టీఆర్‌ఎస్ నుంచి బరిలో ఉన్నారు. గతంలో మాదిరిగానే టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి బంగపడ్డ కోరుకం టి చందర్ ఈసారి కూడా సింహం గుర్తుపై ఫార్వర్డ్ బ్లాక్ నుంచి తలపడుతున్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శాప్ మాజీ చైర్మన్ మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ పడుతున్నారు. సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్ వరుసగా మూడుసార్లు తలపడుతుండడం విశేషం. నియోజకవర్గంలో మొత్తం 16 మంది అభ్యర్థులుండగా, ప్రధానంగా మక్కాన్‌సింగ్‌రాజ్‌ఠాకూర్, సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్ నడుమే పోరు కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment