
సాక్షి, వికారాబాద్ : ఎన్నికల వేళ టీఆర్‌ఎస్ పార్టీకి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. వికారాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి పార్టీ నేతలకు షాకిచ్చారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా చేసి 24 గంటల కూడా కాకముందే మరోనేత పార్టీని వీడడం గులాబీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తీరు నచ్చకనే తాను పార్టీకి రాజీనామా చేసినట్లు సంజీరావు బుధవారం తెలిపారు. తాను నమ్మిన వారే నట్టేటముంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి వికారాబాద్ నుంచి గెలిచిన సంజీవరావుకు ఈసారి టీఆర్‌ఎస్ టికెట్ నిరాకరించింది.
టీఆర్‌ఎస్ తరుఫున మెతుకు ఆనంద్‌ను బరిలో నిలిపింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సంజీవరావు పార్టీ కార్యాక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఐతే ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న చంద్రశేఖర్‌కి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. విశ్వేశ్వరరెడ్డి బాటలోనే ఆయన కూడా నడుస్తారనే వార్తలు వినివిస్తున్నా.. ఆయన మాత్రం ఏపార్టీలో చేరబోయేది ఇంకా వెల్లడించాల్సి ఉంది. టీఆర్‌ఎస్ కీలకంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో పార్టీ నేతల వరుస రాజీనామాలతో గులాబీ దళం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment