
సాక్షి, వరంగల్: సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు అధికార పార్టీ నేతలకు ఊహించని చిక్కులు వచ్చి పడ్డాయి. క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్లేందుకు ఒకటి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా గోదావరి తీరంలో ఉన్న ములుగు, మంథని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న టీఆర్‌ఎస్ నేతలకు ఇబ్బంది కలుగనుంది. తడపలగుట్ట ఎన్‌కౌంటర్‌తో జిల్లాలో ఉన్న టీఆర్‌ఎస్ నేతలకు ఇబ్బందికర పరిస్థితులు సృష్టించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని, దీనికి బదులుగా టీఆర్‌ఎస్ నేతలు లక్ష్యంగా ప్రతికార చర్యలు ఉంటాయంటూ మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ప్రకటన వెలువడింది. మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ ఆ పార్టీ అధికార ప్రతినిధిగా జగన్ పేరుతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర కమిటీ కార్యదర్శి నుంచి హెచ్చరికలు రావడంతో గులాబీ నేతలకు ఇబ్బందులు వచ్చి పడ్డాయి.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దు కలిగి ఉన్న జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపై మావోయిస్టు పార్టీ ఎక్కువ ప్రభావం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు ఎన్‌కౌంటర్లు సైతం ఈ రెండు జిల్లాల పరిధి, సరిహద్దుల్లో జరిగాయి. దీంతో ప్రతీకార చర్యలు ఇక్కడ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఎన్నికల వేళ
సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన ఐదు జిల్లాల పరిధిలో సుమారు 16 అసెంబ్లీ నియోజకర్గాలు ఉన్నాయి. మంథని, ములుగు, భూపాలపల్లి, భద్రాచలం, ఇల్లందు నియోజకవర్గాల్లో మావోయిస్టులు, అజ్ఞాత దళాల ప్రభావం ఎక్కువ. భద్రాచలాన్ని మినహాయిస్తే మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో అధికార టీఆర్‌ఎస్‌కు చెందినవారే ఉన్నారు.
మంత్రి చందూలాల్‌కు ఇబ్బంది
మావోయిస్టు పార్టీ హెచ్చరికల నేపథ్యంలో ములుగుకు చెందిన మంత్రి చందూలాల్‌కు ఎక్కువ ఇబ్బందుల ఎదురుకానున్నాయి. అనారోగ్యం కారణంగా చందులాల్ హైదరాబాద్‌కు పరిమితమయ్యారు. ఇటీవల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. రెండేళ్లపాటు ఎక్కువగా ప్రజల్లోకి రాని ఆయన ఫిబ్రవరిలో పలుమార్లు ములుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో దూకుడు పెంచుతూ ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు జోరుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న క్రమంలో మావోయిస్టుల హెచ్చరిక చందులాల్‌కు రాజకీయంగా ఇబ్బంది కలిగే పరిస్థితి నెలకొంది.