తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ ఏర్పాటుచేయడం ఖాయమని టీఆర్‌ఎస్ పార్టీ పొలిట్ బ్యూరోసభ్యుడు రాములునాయక్ ధీమా వ్యక్తం చేశారు.
కౌడిపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ ఏర్పాటుచేయడం ఖాయమని టీఆర్‌ఎస్ పార్టీ పొలిట్ బ్యూరోసభ్యుడు రాములునాయక్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి కౌడిపల్లికి వచ్చిన సందర్భంగా భుజిరంపేట టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి చిలుముల పద్మ నర్సింహారెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణను తెచ్చింది, ఇచ్చిందితామేనని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
విద్యార్థులు, తెలంగాణవాదులు ఆత్మబలిదానాలు చేసుకుంటే ఏనాడు పరామార్శించని కాంగ్రెస్ నాయకులు నేడు తెలంగాణ అమరుల గురించి మాట్లాడడం బాధాకరమన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమ ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్యం దిగొచ్చి తెలంగాణను ఇచ్చిందన్నారు. తెలుగుదేశం ఆంధ్రాపార్టీ అని, కాంగ్రెస్ ఢిల్లీ పార్టీ అని పేర్కొన్నారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గల్లంతయిందని, ఇక కాంగ్రెస్ సైతం మాయమవుతుందని ఆరోపించారు. ఎంపీటీసీ మొదలు ఎంపీ వరకు అన్నింట్లోనూ టీఆర్‌ఎస్ సత్తా చాటుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు నర్సింహారెడ్డి, వెంకట్‌రెడ్డి, దేవిచంద్, కిషన్‌నాయక్, మధన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.