టీఆర్‌ఎస్ ప్లీనరీ వాయిదా?
తుపాను నేపథ్యంలో కేసీఆర్ యోచన
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ, బహిరంగ సభలను వాయిదా వేయాలని యోచిస్తోంది. అల్పపీడనం వల్ల ఆ రెండు రోజుల్లోనే భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయని వాతావరణ శాఖ నుంచి వస్తున్న సమాచారంతో ఈ సమావేశాలను వాయిదా వేయాలని పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. భారీ వర్షాలుంటే ప్లీనరీ సమావేశం నిర్వహణకు ఇబ్బందులు వస్తాయని, బహిరంగ సభ నిర్వహణ సాధ్యం కాదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ రెండ్రోజుల్లో నిర్వహించాల్సిన సమావేశాలను వాయిదా వేయాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. బుధవారం పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ప్లీనరీ, సభ వాయిదాపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. గురువారం వచ్చే వాతావరణ నివేదికలను బట్టి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.
వేదికపై 210 మంది: ప్లీనరీ వేదికను 210 మంది కూర్చోవడానికి వీలుగా నిర్మిస్తున్నారు. వేదికకు సంబంధించిన ఏర్పాట్లను కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి, పూల రవీందర్ తదితరులు ఎల్బీ స్టేడియంలో బుధవారం పరిశీలించారు. దాదాపు 30 వేల మంది హాజరయ్యే ఈ ప్రతినిధుల సభకు నిజాం కాలేజీ మైదానంలో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. భోజన ఏర్పాట్లను ఫుడ్ కమిటీ చైర్మన్, ఎంపీ జితేందర్ రెడ్డి పరిశీలించారు. కాగా, ప్లీనరీలో తీర్మానాలకు సంబంధించిన అంశాలపై తీర్మానాల కమిటీ... చైర్మన్ కె.కేశవరావు నివాసంలో బుధవారం సమావేశమైంది. ప్లీనరీలో 30 తీర్మానాలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.