సాక్షి, హైదరాబాద్: గిరిజనుల వైద్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మొబైల్ డయాగ్నొస్టిక్స్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గిరిజన ప్రాంత ప్రజలకు అన్ని రకాల రక్త, మూత్ర పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం అధునాతన యంత్రాలను కొనుగోలు చేసి మొబైల్ వాహనాల్లో గిరిజన ప్రాంతాలకే వెళ్లి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో అధికారులు ఇప్పటికే యంత్రాలను పరిశీలించారు. ఒక్కొక్కటి రూ.40 లక్షల వ్యయంతో 12 నుంచి 15 అత్యాధునిక యంత్రాలు కొనుగోలు చేయడానికి వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
తెలంగాణ వచ్చాక గిరిజన వైద్యానికి పెద్దపీట
గతంలో గిరిజన గ్రామాల్లో ప్రజలు అనారోగ్యం బారిన పడితే సరైన వైద్యం అందకపోవడంతో మరణాల సంఖ్య కూడా అధికంగా ఉండేది. వర్షాలు ప్రారంభమైతే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, అతిసారం వంటి వ్యాధులు గిరిజనుల పాలిట శాపంగా మారేవి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం గిరిజన వైద్యానికి పెద్దపీట వేసింది. క్షేత్రస్థాయిలో సిబ్బంది వైద్యసేవలను మెరుగుపర్చడంతో పాటు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో వ్యాధుల నివారణ సాధ్యమైంది. గత మూడేళ్లుగా గిరిజన గూడేల్లోని మలేరియా మరణాలకు బ్రేక్ పడింది. ఏటా వందల సంఖ్యలో ఉండే మరణాలను పూర్తిగా నివారించగలిగింది.
ప్రాథమిక దశలోనే వ్యాధులను నిర్ధారించి చికిత్సలు చేయడంతో ఏజెన్సీలో గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా పలు వ్యాధులకు కారణమయ్యే దోమకాటుకు గురికాకుండా గిరిజన ప్రజలకు దోమతెరలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే వ్యాధులను ముందుగానే నిర్ధారించేందుకు డయాగ్నొస్టిక్స్ సెంటర్లను వారి చెంతకే తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం అధికారులు ఎంపిక చేసిన యంత్రం సాయంతో ఒక్కసారే 200 మందికి సంబంధించిన రక్త నమూనాలకు గంట వ్యవధిలోనే వివిధ రకాల పరీక్షలు నిర్వహించవచ్చు. ప్రతి గ్రామంలో నెలకు కనీసం ఒకసారి ఈ యంత్రాల సాయంతో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు చేయనున్నారు.
ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ, అక్కడ అవసరమైన రోగ నిర్ధారణ యంత్రాలు లేవు. ఏదైనా రోగం వస్తే, అది ముదిరే వరకు గిరిజనులు ఆస్పత్రులకు రావడంలేదు. దీంతో ప్రాణ నష్టం జరుగుతోంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విష జ్వరాలు, వైరస్‌లు విజృంభించే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా మొబైల్ ల్యాబ్‌లు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఈటల రాజేందర్ అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment