సాక్షి, మెదక్: కప్పుడు ఆర్టీసీ సంస్థ మనుగడకే ముప్పు వాటిళ్లే విధంగా ప్రైవేట్ వాహనాలు ఉనికి చాటుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులను అధిక సంఖ్యలో ఆకర్షించేందుకు, ఆర్టీసీ వైపు మళ్లించేందుకు సబ్సిడీ పథకాలను ప్రవేశపెట్టి కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తోంది. ప్రయాణికులు కోరిన చోట ఆపడం, ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, డీలక్స్ బస్సుల్లో కాలక్షేపం కోసం టీవీలను ఏర్పాటు చేయటంతో పాటు పలురకాల వసతులు పెంచింది. డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవడం ప్రారంభమైంది. వీటికి తోడు సబ్సిడీతో కూడిన నవ్య, వనిత, విహారి కార్డులను ప్రయాణికులకు అందించింది. మొదటిసారి నవ్య కార్డు ధర రూ.280 కాగా ఆ మరుసటి ఏడాది రూ.180కి ఇచ్చింది.
పల్లెవెలుగు మొదలుకుని సూపర్ లగ్జరీవరకు అన్ని బస్సుల్లో పదిశాతం సబ్సిడీ పొందే వెసులుబాటు కల్పించింది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.100కే వనిత కార్డును అందించింది. కుటుంబంలోని ఐదుగురు సభ్యులు పదిశాతం రాయితీపై ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రయణించే వారికోసం విహారి కార్డులను సైతం ప్రవేశపెట్టింది. రూ.610 చెల్లిస్తే వారం రోజుల పాటు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సూపర్ లగ్జరీ బస్సులతో పాటు అన్ని బస్సుల్లో సగం చార్జీలకే ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ పథకాలతో సంస్థకు ఎలాంటి లాభం లేదని, పదిశాతం నష్టమేనని తేల్చుకున్న ఆర్టీసీ మే 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాటిని ఎత్తివేసేందుకు సిద్ధమవుతోంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో..
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,260 సబ్సిడీ కార్డులు ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మెదక్ డిపోలో మొత్తం 103 బస్సులు ఉండగా 7 ఎక్స్‌ప్రెస్, 6 లగ్జరీ, 13 డీలక్స్‌తో పాటు 77 పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. ఇవి నిత్యం 39,000 కిలోమీటర్ల మేర ప్రయాణం సాగిస్తుంటాయి. వీటి ద్వారా నిత్యం రూ.11 లక్షలు రావాల్సి ఉండగా రూ.10 లక్షలు మాత్రమే వస్తోంది. ఈలెక్కన నెలకు రూ.30 లక్షల ఆదాయం తగ్గినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మెదక్ డిపో రూ.7కోట్ల నష్టాల్లో ఉందని పేర్కొంటున్నారు. సబ్సిడీ కార్డులను ఎత్తివేçయాలని రాష్ట్ర వ్యాప్తంగా సంస్థ తీసుకున్న నిర్ణయంతో నష్టాల నుంచి కొంత బయట పడే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.
రూ.7 కోట్ల నష్టాల్లో ఉంది
ప్రస్తుతం మెదక్ డిపో రూ.7కోట్ల నష్టాల్లో ఉంది. డిపోలను నష్టాల ఊబి నుంచి బయట పడేయాలనే ఆలోచనతో సబ్సిడీ కార్డులను ఎత్తివేస్తున్నారు. ఇక నుంచి సంస్థ నష్టాలను అధిగమించి లాభాల బాటలో నడుస్తుందని ఆశిస్తున్నాం.– జాకీర్‌హుస్సేన్, మెదక్ డిపో మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment