మా పొట్ట కొట్టకండి.. | TSRTC Employees Requesting Temporary Drivers | Sakshi
Sakshi News home page

మా పొట్ట కొట్టకండి..

Published Wed, Oct 23 2019 4:11 AM | Last Updated on Wed, Oct 23 2019 5:17 AM

TSRTC Employees Requesting Temporary Drivers - Sakshi

జగిత్యాల బస్‌ డిపో వద్ద తమ పొట్ట కొట్టొదంటూ తాత్కాలిక సిబ్బందిని కోరుతున్న మహిళా కండక్టర్లు

సాక్షి, హైదరాబాద్‌: ‘మా పొట్టలు కొట్టకండి.. ప్రజల ప్రాణాలు తీయకండి’ అంటూ ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబసభ్యులు తాత్కాలిక డ్రైవర్ల చేతికి గులాబీ పూలు ఇచ్చి మరీ వేడుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద మంగళవారం కార్మికులు, వారి కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో చేరుకుని డిపోల నుంచి బస్సులు తీస్తున్న తాత్కాలిక బస్సు డ్రైవర్లను అడ్డుకున్నారు. కొన్నిచోట్ల వారి కాళ్లకు దండం పెట్టి మరీ వేడుకోవటం కని పించింది. రాష్ట్ర బంద్‌ తర్వాత మలిదశ సమ్మె కార్యాచరణలో భాగంగా.. తాత్కాలిక సిబ్బందిని కుటుంబ సభ్యులతో కలసి విన్నవించే కార్యక్రమా న్ని మంగళవారం ఏర్పాటు చేశారు. సమ్మె మొదలైనప్పటి నుంచి చాలా ప్రాంతాల్లో తాత్కాలిక డ్రైవర్లు నిర్లక్ష్యంగా బస్సులు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారన్నారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులను చూస్తేనే ప్రజలు వణుకుతున్న పరిస్థితి నెలకొందన్నారు. తాత్కాలిక డ్రైవర్లు విధులు నిర్వర్తించకుంటే వెంటనే ప్రభుత్వం దిగొచ్చి చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తుందని, 49 వేల మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటుందని అన్నారు. తాత్కాలిక డ్రైవర్లు విధులకు దూరంగా ఉండాలని కోరారు. సమ్మె పరిష్కారమైన తర్వాత తాత్కాలిక డ్రైవర్లకు ఎలాగూ ఉద్యోగం ఉండదని, దీన్ని గుర్తించి వెంటనే వెనక్కి వెళ్లాలని సూచించారు.

వర్షాన్ని సైతం లెక్క చేయకుండా.. 
ఖమ్మం డిపో ఎదుట కార్మికులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆందోళనల్లో పాల్గొన్నారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా రోడ్డుపై పడుకుని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో డిపో ఎదుట వంటావార్పు నిర్వహించారు. నల్ల గొండ డిపో వద్ద కార్మికులు చెవుల్లో పూలు పెట్టు కుని నిరసన వ్యక్తం చేశారు. సూర్యాపేట డిపో ఎదుట వంటావార్పు నిర్వహించారు. సమ్మెకు మద్దతుగా అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళనల్లో పాల్గొన్నారు. దీంతో ఈ డిపో పరిధిలో 45 అద్దె బస్సులు రోడ్డెక్కలేదు. సిద్దిపేటలో 40 అద్దె బస్సులకు ఒకే బస్సు నడిచింది. సంగారెడ్డిలో అద్దె బస్సుల డ్రైవర్లు సమ్మెకు సంఘీభావం తెలిపారు. మహబూబ్‌నగర్‌లో కార్మికుల ఆందోళనల్లో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు.

18వ రోజు ఉధృతంగా.. 
18వ రోజు కూడా ఆర్టీసీ కార్మికులు ఉధృతంగా సమ్మెలో ముందుకు సాగారు. జూబ్లీబస్టాండ్‌ వద్ద రోడ్డుపై భారీ ఎత్తున వంటావార్పు నిర్వహించారు. దాదాపు 2 వేల మంది కార్మికులు ఇందులో పాల్గొన్నారు. రోడ్డుమీదనే కార్మికులు, వారి కుటుంబ సభ్యులు భోజనాలు చేశారు. అనంతరం సభ నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, కోదండరాం, కాంగ్రెస్‌ నేతలు మధు యాష్కీ, వీహెచ్, టీడీపి అధ్యక్షుడు ఎల్‌.రమణ, మోత్కుపల్లి నర్సింహు లు, బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, సీపీఎం నేత నరసింహారావు, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు సిద్ధం కావాలని డిమాండ్‌ చేశారు. సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తప్పుడు నివేదిక ఇవ్వడం సిగ్గుచేటని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి విమర్శించారు. వంద శాతం బస్సులు నడుపుతున్నామని ప్రభుత్వం చెప్పుకోవడం అశ్చర్యంగా ఉందన్నారు.

జేబీఎస్‌ వద్ద నిర్వహించిన సభలో మాట్లాడుతున్న అశ్వత్థామరెడ్డి, చిత్రంలో వివిధ పార్టీల నేతలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement