బస్సు పాస్‌లే పెద్ద సమస్య...  | TSRTC Strike Affect: Decision To Decrease City Buses In Hyderabad | Sakshi
Sakshi News home page

సిటీ బస్సులు కుదింపు!

Published Sat, Nov 30 2019 2:51 AM | Last Updated on Sat, Nov 30 2019 12:23 PM

TSRTC Strike Affect: Decision To Decrease City Buses In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం భాగ్యనగరవాసులపై తీవ్రంగా పడనుంది. ఆర్టీసీ నష్టాల్లో సగం సిటీ నుంచే వస్తుండటంతో సిటీ సర్వీసులను భారీగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది! గతంలో ఈ నష్టాలను జీహెచ్‌ఎంసీ నిధులతో భర్తీ చేయాలని భావించినా తాజా సమ్మె సమయంలో అది సాధ్యం కాదని స్వయంగా ప్రభుత్వమే తేల్చేసింది. హైకోర్టుకు సమర్పించిన వివరాల్లోనూ దీన్ని స్పష్టం చేసింది.

దీంతో నష్టాలను తగ్గించుకునేందుకు సిటీ సర్వీసులను కుదించాలన్న దిశగా అధికారులు అందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అయితే ఉన్నఫళంగా సర్వీసులు తగ్గించకున్నా సిటీ రీజియన్‌లో పదవీ విమరణ చేసే సిబ్బంది స్థానంలో కొత్త వారిని ఇక నియమించరు. ఫలితంగా బస్సుల సంఖ్యను కూడా కుదించేందుకు మార్గం సుగమమవుతుంది. దీంతో ప్రస్తుతం నగరంలో ఉన్న 3,500 బస్సుల సంఖ్య క్రమంగా తగ్గనుంది.

బస్సు పాస్‌లే పెద్ద సమస్య... 
హైదరాబాద్‌లో బస్సు పాస్‌లతోనే ఆర్టీసీకి పెద్ద సమస్య ఉత్పన్నమవుతోంది. ఇది ఆర్టీసీ నష్టాలను పెంచుతోంది. పాస్‌ల రూపంలో రాయితీ ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి ఆర్టీసీకి రీయింబర్స్‌ చేయాల్సి ఉండగా సకాలంలో ఆ నిధులు అందక ఆర్టీసీ కొట్టుమిట్టాడుతోంది. నగరంలో 9.17 లక్షల విద్యార్థి పాస్‌లు ఉన్నాయి. వాటిలో నెలవారీ రూ.130తో కొనే జనరల్‌ పాస్‌లు 2.76 లక్షలుండగా రూ. 390తో 3 నెలలకోసారి కొనే పాసులు 6.41 లక్షలున్నాయి. సాధారణ ప్రయాణికుల పాసులు 17.56 లక్షలున్నాయి.

ఇందులో రూ.770తో కొనే జనరల్‌ పాసులు 3.29 లక్షలుంటే రూ. 880తో కొనే మెట్రో పాసులు 14.27 లక్షలున్నాయి. భారీగా పాసులు ఉండటంతో ఆర్టీసీ ఆదాయం పడిపోతోందనేది అధికారుల మాట. ఇక ఉద్యోగులు, విద్యార్థులు ఉదయం, సాయంత్రం వేళల్లో ఒకేసారి బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో ఆ వేళల్లో రద్దీగా తిరుగుతున్న బస్సులు, ఆ తర్వాత కొంత ఖాళీగా ఉంటున్నాయి. ఈ బస్సుల్లో దాదాపు 8 వేల మంది కండక్టర్లు, డ్రైవర్లు పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది సీనియర్లే కావడంతో వారి వేతనాలూ ఎక్కువగా ఉంటున్నాయి. నగరంలో 30 శాతం ఇంటి అద్దె భత్యం ఉండటంతో ఆ రూపంలో భారం పడుతోంది. దీంతో సిటీ సర్వీసుల సంఖ్యను తగ్గించడమే పరిష్కారమని అధికారులు నిర్ణయానికి వచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement