సాక్షి, వరంగల్ : గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన ఆర్టీసీ కండక్టర్ రవీందర్ మృతి చెందారు. హన్మకొండ డిపోకు చెందిన రవీందర్‌కు నాలుగు రోజుల క్రితం టీవీ చూస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. దీంతో అతన్ని హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవీందర్ గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో పోలీసులు భారీ కాన్వాయ్‌తో రవీందర్ మృతదేహాన్ని ఆయన స్వస్థలం వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరుకు తరలించారు. రవీందర్‌కు భార్య రజిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రవీందర్ మృతితో ఆర్టీసీ కార్మికులు పెద్త ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరులో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. రవీందర్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పరకాల డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపారు. డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 29వ రోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యచరణను ప్రకటించారు. అలాగే సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ఈ నెల ఐదో తేదీలోగా విధుల్లో చేరాలని, లేని పక్షంలో వారికి ఆర్టీసీతో సంబంధాలు తెగిపోయినట్లేనన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో కార్మిక సంఘాల జేఏసీ ఆదివారం ఉదయం అత్యవసర సమావేశం నిర్వహించనుంది.
Comments
Please login to add a commentAdd a comment