రామకృష్ణాపూర్: తోడ బుట్టిన అక్కను ప్రాణాపాయం నుంచి కాపాడుకోవడానికి ఓ చెల్లెలు చేసిన అవయవదానం ఆమెనే బలి తీసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమో.. మరేమో.. కారణమేదైనా చివరికి ఆ అక్క ప్రాణాలు కూడా నిలవలేదు. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరూ చనిపోవడం ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్‌లో కలకలం సృష్టిం చింది. రామకృష్ణాపూర్‌కు చెందిన రాబర్ట్ డేవిడ్-విజయకుమారిలకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులున్నారు. పెద్ద కూతురు దయూరాణి (52) ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కాగా, పరీక్షలు చేసిన వైద్యులు లివర్ మార్చాలని సూచించారు. డిసెంబర్‌లోపు చికిత్స చేయకుంటే బతకడం కష్టమన్నారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో రూ. 30 లక్షలు వెచ్చించి చికిత్స చేరుుంచేందుకు కుటుంబీకులు సిద్ధమయ్యూరు.
దయూరాణి సోదరి నిర్మలారాణి(41) తన లివర్‌లోని కొంత భాగాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో దాదాపు 40 పరీక్షలు చేసిన ఆస్పత్రి వైద్యులు నిర్మల అన్నివిధాలా అర్హురాలంటూ నిర్ధారించారు. ఇందుకు రూ. 2 లక్షల వరకు తీసుకున్నారు. గతేడాది డిసెంబర్ 22న నిర్మలారాణి నుంచి 65 శాతం లివర్ సేకరించి దయారాణికి అమర్చారు. అరుుతే.. అదే నెల 26న తీవ్ర అనారోగ్యంతో నిర్మలారాణి మృతి చెందింది. అయితే, కిడ్నీ ఫెరుులై మృతి చెందిందని వైద్యులు చెప్పారు. ఆ సమయంలో ఇంకా దయారాణి ఆస్పత్రిలోనే ఉండడంతో కుటుంబసభ్యులు ఏం మాట్లాడలేకపోయారు. అయితే.. ఫిబ్రవరి 6న దయారాణి కూడా మృతి చెందిందంటూ బంధువులకు చెప్పారు. చాలా రోజుల క్రితమే చనిపోయినట్లుగా శరీరం కుళ్లిపోయి ఉంది. చేసేదేమీ లేక మృతదేహాన్ని ఖననం చేశారు. రూ.40 లక్షలు ఖర్చు చేసినా ఇద్దరూ మృతిచెందడంతో మృతుల సోదరుడు ఆల్‌ఫ్రెడ్, నిర్మలారాణి భర్త రెడ్డిమల్ల నర్సయ్య కార్పొరేట్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంపై రాష్ట్ర గవర్నర్, డీజీపీలకు ఫిర్యాదు చేశారు.