కల సాకారం..  | Two New Districts Formation In Telangana | Sakshi
Sakshi News home page

కల సాకారం.. 

Published Sun, Feb 17 2019 11:27 AM | Last Updated on Sun, Feb 17 2019 11:27 AM

Two New Districts Formation In Telangana - Sakshi

ఎట్టకేలకు ములుగు ప్రాంత ప్రజల కల సాకారమైంది. నాలుగున్నరేళ్ల  ప్రజా ఉద్యమానికి ఫలితం లభించింది. ములుగు జిల్లా ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీఓ విడుదల చేసింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నుంచి విడిపోయి తొమ్మిది మండలాలతో కొత్తగా ములుగు జిల్లా ఉనికిలోకి రానుంది. ఆదివారం నుంచి అధికారికంగా పాలన ప్రారంభం కానుండగా.. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సమ్మక్క–సారలమ్మ పేరు ప్రస్తావన రాలేదు. మల్లంపల్లి మండల హామీపై కూడా స్పష్టత లేదు.
 

సాక్షి, భూపాలపల్లి/ములుగు: ఇప్పటి వరకు రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా కొనసాగిన ములుగును జిల్లాగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీఓ విడుదల చేసింది. కొత్తగా నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33 కు చేరింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి వరంగల్‌ను ఐదు ముక్కలుగా చేశారు. ప్రస్తుతం ములుగు ఏర్పాటుతో జిల్లాల సంఖ్య ఆరుకు చేరింది. జిల్లా కోసం ఉద్యమించిన ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం నెరవెర్చింది. 9 మండలాలతో కూడిన జిల్లా నేటి నుంచి ఉనికిలోకి రానుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ నెరవేర్చడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భౌగోళిక స్వరూపం.. 
ములుగు, వెంకటాపురం(ఎం)ఎస్‌ఎస్‌ తాడ్వాయి, గోవిందరావుపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె) మండలాలతో ములుగు జిల్లా మనుగడలోకి రానుంది. 9 మండలాల పరిధిలో 3,881 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో జిల్లా ఏర్పడనుంది. 177 గ్రామపంచాయతీలు, 336 గ్రామాలు ఉన్నాయి. 6,175 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో రాష్ట్రంలోనే నాలుగో పెద్ద జిల్లాగా ఉన్న భూపాలపల్లి తన స్థానాన్ని కోల్పోనుంది. పాత 31 జిల్లాలతో పోల్చితే ములుగు 18వ పెద్ద జిల్లాగా కొనసాగనుంది. 2011 జనాభా లెక్కల  ములుగు జిల్లాలో 2,94,671 మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం జానాభా 3.10 లక్షలకు మించి ఉంటుందని అధికారులు అంటున్నారు. జిల్లాలో ములుగు మాత్రమే రెవెన్యూ మాత్రమే రెవెన్యూ డివిజన్‌ హోదా కలిగి ఉంది. ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలోని    కొత్తగూడ, గంగారం మండలాలు ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లాలో ఉన్నాయి. నియోజకర్గంలోని మిగతా ఏడు మండలాలతో పాటు భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడు, వెంకటాపురం ములుగు జిల్లాలో ఉండనున్నాయి.
 
ఆదివాసీలు.. పర్యాటకం.. 
రాష్ట్రంలో ముఖ్య పర్యాటక కేంద్రంగా  ములుగు జిల్లా విరాజిల్లనుంది.   
మేడారం సమ్మక్క–సారలమ్మ గిరిజన జాతర కొంగుబంగారం కానుంది. ఓ వైపు ప్రకృతి అందాలు, మరోవైపు ఆదివాసీ గరిజనుల సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరియనున్నాయి. ఏటూరునాగారం ఐటీడీఏ జిల్లా పరిధిలోనే ఉండడం,  వైల్డ్‌లైఫ్, తాడ్వాయిలోని ఎకోటూరిజం, బొగత జలపాతం, రామప్ప ఆలయం, లక్నవరం సరస్సు పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయి. ఇదే విధంగా జిల్లా పూర్తిగా ఆదివాసీ, గిరిజన జనాభాతో నిండి ఉంది.

జిల్లా సాధన  సమితి ఆధ్వర్యంలో సంబురాలు..  
జిల్లా ఏర్పాటు చేయడంతో జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతి, ఎండీ.మున్సిమ్‌ఖాన్, కుర్రి దివాకర్, రవళిక, కృష్ణవేఢి, బీజేపీ నాయకులు సిరికొండ బలరాం, బల్గూరి  చంద్రయ్య కల్వల సంజీవ ఆధ్వర్యంలో శనివారం సంబురాలు జరుపుకున్నారు. జాతీయ రహదారిపై టపాసులు కాలుస్తూ సంబురాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు.   

ఊసేలేని సమ్మక్క–సారలమ్మ పేరు  
ములుగును సమ్మక్క–సారలమ్మ జిల్లాగా ఏర్పాటు చేయాలని నాలుగున్నర సంవత్సరాలుగా స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే  ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ములుగు జిల్లా పేరును మాత్రమే పొందిపరిచింది. దీంతో నియోజకవర్గ ప్రజలు, తల్లుల భక్తులు నిరుత్సాహంలో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి సమ్మక్క–సారలమ్మ పేరిట జిల్లా పేరును మార్చాలని కోరుతున్నారు.   

తగ్గిన భారం.. 
ములుగు డివిజన్‌లోని వెంకటాపురం(కె), వాజేడు, మంగపేట, కన్నాయిగూడెం మండలాల ప్రజలకు ఉమ్మడి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా సుమారు 120 నుంచి 140 కిలో మీటర్ల దూరంలో ఉంది. ములుగును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంత ప్రజలకు దూరభారం తగ్గింది. అత్యవసర పనుల కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే మూడున్నర గంటల పాటు ప్రయాణించే ఏజెన్సీ వాసులు ప్రస్తుతం కేవలం రెండున్నర గంటల్లో ములుగు జిల్లా కేంద్రానికి చేరుకునే అవకాశం కలిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement