
ఎమ్మెల్యే ఆఫీసు వద్ద ఆత్మహత్యాయత్నం
సాక్షి, మానకొండూరు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కార్యాలయం వద్ద ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. బెజ్జంకి మండలం గూడెనికి చెందిన శ్రీనివాస్, పరుశరామ్ అనే యువకులు ఎమ్మెల్యే రసమయి ఆఫీసుకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్ర కాలిన గాయాలైన ఇద్దరికి కరీంనగర్ లో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
బాధితులను మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. దళితులకు భూపంపిణీ చేయడానికి ఎకరానికి రూ.20 వేలు వీఆర్వో రవి డిమాండ్ చేశాడని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడానికి వెళ్లి ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డాడని శ్రీనివాస్ భార్య తెలిపారు. వెంటనే మంత్రి ఈటల.. కలెక్టర్ తో మాట్లాడి వీఆర్వో రవిని సస్పెండ్ చేయించారు. బాదితులకు ప్రభుత్వ పరంగా వైద్యం అందిస్తామని మంత్రి ఈటల తెలిపారు.
పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదంటూ మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే టీఆర్‌ఎస్ నేత అయూబ్‌ఖాన్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన ఇటీవల వికారాబాద్ జిల్లా తాండూరులో కలకలం సృష్టిం చింది.