విశ్వవిద్యాలయాలను గాడిన పెట్టేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారులను రిజిస్ట్రార్లుగా నియమించడం ద్వారా విశ్వవిద్యాలయాల పాలనను గాడిలో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రాజకీయ జోక్యం కలిగిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు కూడా వర్సిటీలను గాడిలో పెట్టలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నందున వీలైతే వైస్ చాన్స్‌లర్లుగా (వీసీ) కూడా ఐఏఎస్‌లనే నియమించాలని యోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో రెండు మూడు వర్సిటీలకు మినహా మిగతా వాటికి ఇన్‌చార్జి వీసీలే ఉన్నారు.
ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు కూడా సరిగ్గా లేవు. ఈ నేపథ్యంలో వీసీలుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై విద్యావేత్తలతో చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలు దీనికి అడ్డుకానున్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం.. కనీసం పదేళ్లు ప్రొఫెసర్‌గా అనుభవం ఉన్న వారే వీసీ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్న నిబంధన ఉంది. ఆ నిబంధనను మార్చడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదన్న భావన నెలకొంది.
ఇదీ వర్సిటీల పరిస్థితి..
ప్రస్తుతం రాష్ట్రంలోని తెలుగు విశ్వవిద్యాలయం, పాలమూరు, శాతవాహన వర్సిటీలకు మినహా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, హైదరాబాద్ జేఎన్‌టీయూ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలకు ఇన్‌చార్జిలే వీసీలుగా ఉన్నారు. జేఎన్‌టీయూకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శైలజారామయ్యార్, ఉస్మానియా, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య ఇన్‌చార్జి వీసీలుగా కొనసాగుతున్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయానికి పౌరసరఫరాలశాఖ కమిషనర్ పార్థసారథి ఇన్‌చార్జి వీసీగా కొనసాగుతుం డగా, కాకతీయ విశ్వవిద్యాలయానికి ఇన్‌చార్జి వీసీగా కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వీరారెడ్డి కొనసాగుతున్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి ఇన్‌చార్జి వీసీగా మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ భాగ్యనారాయణ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరు యూనివర్సిటీల్లో పూర్తిస్థాయి వైస్ చాన్స్‌లర్ల నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
వర్సిటీల రిజిస్ట్రార్లుగా ఐఏఎస్‌లు!
Published Tue, Jan 20 2015 1:14 AM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM
Advertisement