మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) పట్ల నిరుపేద కూలీల్లో అవగాహన కల్పించే నిమిత్తం కళాజాతాలతో ప్రదర్శనలు ఇప్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) పట్ల నిరుపేద కూలీల్లో అవగాహన కల్పించే నిమిత్తం కళాజాతాలతో ప్రదర్శనలు ఇప్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో తొలుత ఈ కార్యక్రమాన్ని పెలైట్ ప్రాజెక్టుగా చేపట్టి తరువాత ఇతర జిల్లాలకు వర్తింప జేయాలన్న యోచన చేస్తున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వెంకటేశ్వర్లు బుధవారం ఉత్తర్వులు జారీచేశా రు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం అవసరం లేని పని చేయడానికి ముందుకు వచ్చే ప్రతి కుటుంబంలోని వయోజనులందరికీ కనీసం 100 రోజుల పాటు ఉపాధి కల్పిండమే ఎంజీ ఎన్‌ఆర్‌ఈజీఎస్ ప్రధాన లక్ష్యం.
మార్గదర్శకాలు ఇలా.. : రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన, వలసలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూలీలను చైతన్యపరచాల్సిన మండలాలను ఎంపిక చేయాలి. గ్రామాల ఎంపిక బాధ్యతను సంబంధిత జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డెరైక్టరు చేపట్టాలి. కళాజాత ప్రదర్శనలను కూలీలంతా గ్రామంలో ఉండే సమయంలో (రాత్రి 7నుంచి 10గం. మధ్య) నిర్వహించాలి. జిల్లాకు చెందిన కళాబృందాలతోనే ప్రదర్శనలను నిర్వహించాలి.