రైతులు కష్టాలు పడుతుంటే.. సంబురాలా?
సీఎం కేసీఆర్‌పై కెప్టెన్ ఉత్తమ్ ఫైర్
మఠంపల్లి: పంటలకు గిట్టు బాటు ధర లభించక, అప్పులు తీర్చే మార్గం లేక రైతులు కష్టాలు పడుతుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం నిస్సి గ్గుగా టీఆర్‌ఎస్ పార్టీ సంబు రాలు జరుపుకొంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గురువారం సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో ఎత్తిపోతల రైతులు, కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
పత్తి, మిర్చి, ధాన్యం రైతులు గిట్టుబాటు ధర లేక లబోదిబోమంటుంటే టీఆర్‌ఎస్ పాలకులు గులాబీ కూలీ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కేవలం కేసీఆర్ ప్రభుత్వంలోనే 3 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులిస్తామని, నియామకాలు చేస్తామని మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవంలో విద్యార్థుల ముందు సీఎం ప్రసంగించే సాహసం ఎందుకు చేయలేదో తెలపాలన్నారు.