మోర్తాడ్/భీమ్‌గల్:(బాల్కొండ): అబద్దపు మాటలతో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్‌ను తరిమికొట్టాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. టీపీసీసీ బస్సుయాత్రలో భాగంగా సోమవారం భీమ్‌గల్‌లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని టీఆర్‌ఎస్ అడ్డుకుందని, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల ఆశ చూపి ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇల్లు కట్టించిలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు మంజూరు చేయడంతో పాటు అదనపు గది, టాయిలెట్లు నిర్మింపజేస్తామన్నారు.
గల్ఫ్ బాధితులకుం అండగా ఉంటాం..
గల్ఫ్ దేశాలకు వలసపోయే వారికి స్థానికంగానే ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్ వాటిని మరిచిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లలో వందల మంది గల్ఫ్ దేశాల్లో మృతి చెందారని, ఇప్పటివరకు ఏ ఒక్కరికి సాయం అందించలేదన్నారు. కువైట్‌లోని మన కార్మికులు స్వదేశానికి వచ్చేందుకు సాయం కోసం ఎదురు చూస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చినా.. ఏ ఒక్కరికీ సాయం చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్ కుంతి యా నాయకత్వంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కువైట్‌కు వెళ్లి తెలంగాణ కార్మికులకు అండగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గల్ఫ్ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు.
పెట్టుబడి సాయం జిమ్మిక్కే..
రైతుకు పెట్టుబడి సాయం కేసీఆర్ ఎన్నికల జిమ్మిక్కే అని ఉత్తమ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీతో పాటు పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. వరి, జొన్న, మొక్కజొన్న పంటలకు క్వింటాలుకు రూ.2 వేలకు తగ్గకుండా ఎర్ర జొన్నలకు క్వింటాలుకు రూ.3 వేలకు తగ్గకుండా, పసుపు, మిర్చి పంటలకు రూ.10 వేల మద్దతు ధర అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.10 లక్షల చొప్పున వడ్డీలేని రుణం అందిస్తామన్నారు. రూ. లక్ష చొప్పున రివాల్వింగ్ ఫండ్ కేటాయించి మహిళా సంఘాలను బలోపేతం చేస్తామన్నారు.
భీమ్‌గల్ ప్రాంతానికి ప్రాణహిత చేవెళ్ల ద్వారా గోదావరి జలాలను తీసుకొస్తామన్నారు. కేసీఆర్ జర్నలిస్టులను కూడా మోసగించారని, హెల్త్‌కార్డ్‌లు ఆసుపత్రులలో తిరస్కరణకు గురవుతున్నాయన్నారు. తాము అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇళ్లు కేటాయిస్తామన్నారు. మాజీ విప్ అనిల్ అధ్యక్షతన జరిగిన సభలో శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, కిసాన్ కేత్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండ రెడ్డి, నాయకులు మహేష్‌కుమార్ గౌడ్, అరికెల నర్సారెడ్డి, రాజారాం యాదవ్, తాహెర్, మోహన్‌రెడ్డి, సురేందర్, చంద్రునాయక్, జితేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment