
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో విడుదల చేసిన మూడు ఎమ్మెల్సీల ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, లేదంటే రీషెడ్యూల్ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాకు గురువారం లేఖ రాశారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 6న నోటిఫికేషన్ విడుదల చేసి ఏడో తేదీ నుంచి నామినేషన్ల దాఖలు తేదీ ప్రకటించారని, అసలు ఓటర్ల జాబితా లేకుండా నామినేషన్లు ఎలా దాఖలు చేస్తారని లేఖలో ఆయన ప్రశ్నించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు సదరు అభ్యర్థిని 10 మంది ఓటర్లు బలపర్చాల్సి ఉంటుందని, కానీ అసలు ఓటరు జాబితా లేకుండానే నామినేషన్ వేయాలని చెప్పడం అర్థరహితమన్నారు. ఈ విషయంలో ఇప్పటికే రెండు రోజులు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై అఖిల పక్షంతో కలిసి తాము తెలంగాణ సీఈవో రజత్‌కుమార్‌ను కలిసినప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ ద్వారానే అన్ని నిర్ణయాలు జరుగుతాయని చెప్పారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఓటరు జాబితా ప్రకటించలేదన్నది వాస్తవమేనని అంగీకరించారని తెలిపారు. అయినా మే 27తో పదవీకాలం ముగుస్తున్న ఓటర్ల చేత మే 31న ఓట్లు ఎలా వేయిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ చూస్తుంటే అధికార టీఆర్‌ఎస్ ప్రభావంతోనే ఈ నోటిఫికేషన్ వచ్చిందని తమకు అర్థమవుతోందని ఆ లేఖలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకుగాను ఈనెల 6వ తేదీన ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని లేదంటే కొత్త ఓటర్లు వచ్చే వరకు రీషెడ్యూల్ చేయాలని ఉత్తమ్ లేఖలో కోరారు.