
అర్థరాత్రి వంటేరు నివాసంలో పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి నివాసంలో అర్థరాత్రి హైడ్రామా నెలకొంది. కొంపల్లిలోని తన నివాసానికి సోదాల పేరుతో పోలీసులు రావడంతో తనన వేధిస్తున్నారంటూ వారి ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. దీంతో అర్థరాత్రి ఆయన నివాసంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రతాప్ రెడ్డి ఇంటిని పోలీసులు ముట్టడించడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. పోలీసులు తనన ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్భందిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. (నా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు)
అరెస్ట్ వారెంట్ లేకుండా అర్థరాత్రి సమయంలో ఇంటికి ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రతాప్ రెడ్డిని పోలీసులు చంపేస్తారంటూ అక్కడికి చేరుకున్న ఆయన మద్దతుదారులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంతో కేసీఆర్‌కు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. కాగా సోదాలు నిర్వహించినప్పటికి ఆయన నివాసంలో ఏమీ దొరకలేదని అధికారులు ప్రకటించారు. పోలీసులు, ఎన్నికల అధికారుల తీరు మారకపోతే తాను ఆత్మబలిదానం చేసుకుంటానని సోమవారమే ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే.