సాక్షి, హైదరాబాద్: ‘గజ్వేల్‌లో నేను ప్రచారం చేయను. కేసీఆర్ కూడా ప్రచారం చేయవద్దు. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూద్దాం’ అని గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. గజ్వేల్‌లో కేసీఆర్ డిపాజిట్ కోల్పోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఓటమి భయంతోనే హరీష్ 40 రోజులుగా గజ్వేల్ మకాం వేశారని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి వంటేరు ప్రతాప్‌రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తనపై కేసీఆర్ 24 కేసులు అక్రమంగా పెట్టించారని ఆరోపించారు. పోలీసులు కేసీఆర్ కుటుంబ సభ్యులు చెప్పిందే చేస్తున్నారని, హరీష్‌రావు గజ్వేల్‌లో కోట్లు వెదజల్లుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఆధారాలతో పిర్యాదు చేసినా ఈసీ, పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్‌పై పోటీచేసే ధైర్యమా నీకు అంటూ తనను బెదిరిస్తున్నారని చెప్పారు.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మాట్లాడుతూ.. గ్వజేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి పట్ల సీఎం కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గజ్వేల్‌లో స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని అన్నారు. వంటేరు ప్రతాప్‌రెడ్డిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, పోటీలో నుంచి తప్పుకోవాలని ఆయనను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ కూడా ఇక్కడి పరిస్థితిని పట్టించుకోవడం లేదని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. నిష్పాక్షికంగా పనిచేయాలని ఈసీని, పోలీసులను హెచ్చరిస్తున్నట్టు ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్‌కు సిగ్గులేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment