‘ప్రాణహిత’ను కాళేశ్వరానికి తరలించొద్దు
- వివిధ సంఘాల నేతల డిమాండ్
- అదే జరిగితే రాష్ట్రానికి తీరని నష్టమని హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు సాగు, తాగునీరు అందించే ‘ప్రాణహిత-చేవెళ్ల’ పథకం బ్యారేజీని తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరానికి తరలించొద్దని వివిధ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అదే జరిగితే ఆదిలాబాద్ జిల్లాకు ఒక్క చుక్క నీరు దక్కకపోగా.. రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని వారు హెచ్చరించారు.
ఈ అంశంపై శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి, తుమ్మిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్టు పరిరక్షణ వేదికకు చెందిన కేవీ ప్రతాప్, ఉమామహేశ్వర్‌రావు, సామాజిక స్పందన వేదిక నేత కె.నారాయణ, తెలంగాణ జలసాధన సమితి నాయకులు నైనాల గోవర్ధన్, స్వార్ధభారతి చైర్మన్ వై.మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
తక్కువ నీటి సామర్థ్యం, ముంపు, పర్యావరణం, అధిక విద్యుత్ అవసరాల దృష్ట్యా కాళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మాణం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఏడేళ్ల కిందట అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించారని.. ఇప్పుడు ఆదిలాబాద్‌లోని గిరిజనులకు అన్యాయం చేసేలా టీఆర్‌ఎస్ ప్రభుత్వం డిజైన్ మార్పులకు పూనుకున్నదని విమర్శించారు.
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టేందుకు మహారాష్ట్ర అభ్యంతరం చెబుతోందన్నది అసంబద్ధ వాదన అని, కాళేశ్వరం వద్ద కట్టినా అవతలి ఒడ్డు కూడా ఆ రాష్ట్ర పరిధిలోనిదేనని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వెనుక మతలబేమిటని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా బ్యారేజీ నిర్మాణాన్ని కాళేశ్వరానికి తరలించాలన్న యోచనను మానుకోవాలని, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఆదిలాబాద్ తూర్పు ప్రాంతంలోని 5 లక్షల ఎకరాలకు నీరందించాలని డిమాండ్ చేశారు.