సాక్షి, సిటీబ్యూరో: ప్రతి ఏటా లోకల్ సీజన్‌లో కూరగాయల ధరలు తగ్గుతాయి. దీంతో నగర ప్రజలకు దాదాపు అన్ని రకాల కూరగాయలు అందుబాటు ధరల్లో లభిస్తాయి. ప్రత్యేకంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్, మెదక్, నిజామాబాద్‌తో పాటు ఇతర జిల్లాల నుంచి నగర మార్కెట్‌కు కూరగాయల దిగుమతులు పెరుగుతాయి. దీంతో దాదాపు అన్ని రకాల కూరగాయలు కిలో రూ.20 నుంచి రూ.35 మధ్యలోనే ఉన్నాయి. ప్రత్యేకంగా టమాటా, బెండకాయ, వంకాయ, చిక్కుడు, బీన్స్‌తో పాటు ఇతర కూరగాయలు కిలో ధర రూ.20–30 వరకు పలుకుతున్నాయి. గత వారం పది రోజుల నుంచి స్థానికంగా కూరగాయల దిగుమతి పెరగడంతో గతంలో ఉన్న కూరగాయల ధరలు సగానికి పడిపోయాయి.
గతేడాది కంటే తక్కువ
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ మొదటి వారం నుంచే కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది అన్ సీజన్ (ఫిబ్రవరి నుంచి అక్టోబర్) నెలలో కూరగాయల ధరలు ఎక్కువగా ఉండేవి. ఈ ఏడాది అక్టోబర్ చివరి వారం నుంచే నగరానికి శివారు జిల్లాల నుంచి కూరగాయల దిగుమతులు పెరిగాయి. దీంతో రేట్లు దిగొచ్చాయి.
శివారు జిల్లాల నుంచి
సాధారణంగా అన్ సీజన్‌లో నగర ప్రజల కూరగాయల అవసరాలు తీర్చడానికి కమీషన్ ఏజెంట్లు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్ నుంచి నగరంలోని బోయిన్‌పల్లి, గడిమల్కాపూర్, ఎల్‌బీనగర్‌తో పాటు ఇతర మార్కెట్లకు రోజుకు 70 నుంచి 80 శాతం వివిధ రకాల కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల నుంచే కూరగాయల దిగుమతులు ఉండేవి. ప్రస్తుతం నగర శివారుతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా కూరగాయల దిగుమతులు పెరగడంతో ధరలు తగ్గాయి.
అందుబాటు ధరల్లో కూరగాయలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో రైతులు ఎక్కువగా కూరగాయలు పండిస్తున్నారు. ప్రత్యేకంగా రంగారెడ్డి, వికరాబాద్, మెదక్ జిల్లాల రైతులు ఈ ఏడాది ఆగస్టు నెల నుంచే కూగాయల సాగు చేస్తున్నారు. దీంతో అక్టోబర్ మొదటి వారం నుంచే పంట చేతికి వచ్చింది. దీంతో ఏడాది కూరగాయల ధరలు తగ్గాయి. 80 శాతం కూరగాయల అవసరాలు శివారు జిల్లాల నుంచి వచ్చే దిగుమతులతోనే తీరుతున్నాయి. ప్రస్తుతానికి ఇతర రాష్ట్రాల నుంచి ఇక దిగుమతి అవసరం లేదు. – కె.శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి, గుడిమల్కాపూర్ మార్కెట్
Comments
Please login to add a commentAdd a comment