జనగామ: అసెంబ్లీ ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ విజన్ లేదని బీజేపీ శాసనసభా పక్షనేత డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. జనగామలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజు తెలంగాణకే తలవంపులు తెచ్చేలా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరించారని మండిపడ్డారు. అసెంబ్లీ దేవాలయం లాంటిదని.. అటువంటి చోట యుద్ధ వాతావరణం, భౌతిక దాడులు సబబు కాదన్నారు. దేశంలోనే ఆదర్శ పాలన.. స్వయం పాలన అన్న సీఎం కేసీఆర్ తన మాటలను విస్మరించారన్నారు. నిరసన తెలిపేందుకు ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు చేరుకుంటే అధికార పక్ష ఎమ్మెల్యేలు ఎందుకు అక్కడికెళ్లి అడ్డుకున్నారని ప్రశ్నిం చారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికార పక్ష ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ గీతాలాపన సమయంలో ఉద్దేశపూర్వకంగా అవమాన పరిచినట్లు రుజువైతే ప్రతిపక్ష సభ్యులపైనా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు తదితరులు ఉన్నారు.