‘ఆసరా’ అడిగితే కొట్టాడు
21వ వార్డు కౌన్సిలర్‌పై వృద్ధురాలి ఫిర్యాదు
కామారెడ్డిటౌన్ : ఆసరా ఫించన్ వచ్చేలా చూడాలని కోరితే తనపై కౌన్సిలర్ చేయి చేసుకున్నాడని కామారెడ్డి 21వ వార్డుకు చెందిన వృద్ధురాలు లక్ష్మి ఆరోపించింది. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తనకు 70 ఏళ్లు ఉంటాయని తెలిపింది. మూడు నెలలుగా పింఛన్ వస్తలేదని పేర్కొంది. దరఖాస్తు చేసుకున్నా పింఛన్ రాకపోవడంతో వార్డు కౌన్సిలర్ జొన్నల నర్సింలును వేడుకోవడానికి గురువారం ఉదయం వెళ్లానని తెలిపింది.
ఆయన కోపంతో తన చెంపపై కొట్టి నెట్టివేశాడని ఆరోపించింది. దీంతో పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశానని తెలిపింది. ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. తాను లక్ష్మిపై చేయి చేసుకోలేదని, కొందరు తనపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని కౌన్సిలర్ పోలీసులతో తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేలో పేరు లేకపోవడంతో లక్ష్మికి పింఛన్ రాలేదన్నారు. సర్వే చేయించామని పేర్కొన్నారు. ఈ సంఘటనపై సీఐ శ్రీనివాస్‌రావు సంప్రదించగా ఇంకా కేసు నమోదు చేయలేదని, విచారణ జరుపుతున్నామని చెప్పారు.