
గర్ల్స్ హాస్టల్‌లో వార్డెన్ విందు..చిందులు..!
బాలికల వసతి గృహంలో నిర్వాకం
షాద్‌నగర్ క్రైం: అది బాలికల వసతి గృహం.. బయటి వ్యక్తులెవరినీ లోనికి రానివ్వకుండా చూడాల్సిన వార్డెనే తన కూతురు పుట్టిన రోజంటూ అక్కడ విందు ఏర్పాటు చేసింది. డీజేలు పెట్టి చిందులు వేయించింది.. ఈ తతంగాన్ని చూసిన విద్యార్థి సంఘం నాయకులు ఇదేంటని ప్రశ్నిస్తే వారిపైకి నా ఇష్టం అంటూ శివాలెత్తింది. విషయం పెద్దదై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో సోమవారం జరిగింది. పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆదివారం రాత్రి వార్డెన్ పద్మ తన కూతురు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా డీజే మ్యూజిక్, చికెన్ వంటకాలు, మంచి కల్లును ఏర్పాటు చేశారు. ఈ విందుకు బంధుమిత్రులతో పాటు వార్డెన్ స్నేహితులు హాజరయ్యారు. మద్యం సేవించి డ్యాన్సులు చేస్తూ తమను తామే మరచిపోయారు.
హాస్టల్‌లో నుంచి వస్తున్న శబ్దాలను గమనించిన విద్యార్థి సంఘం నాయకులు అక్కడకు చేరుకొని ఇదేంటని వార్డెన్‌ను ప్రశ్నించారు. దీంతో వార్డెన్ వారిపై శివాలెత్తింది. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘం నాయకులకు, వార్డెన్‌కు వాగ్వివాదం జరిగింది. విషయాన్ని విద్యార్థి సంఘం నాయకులుఅధికారులకు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోమవారం తహశీల్దార్ చందర్‌రావు, ఎంపీడీఓ రాజేశ్వరి హాస్టల్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం అధికారులు వార్డెన్‌ను మందలించి సంబంధిత శాఖకు సమాచారమిచ్చారు. దీంతో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ సురే‹శ్‌రెడ్డి హాస్టల్‌ను సందర్శించారు. హాస్టల్ గదిలో ఉన్న చికెన్ వంటకాలతో పాటు కల్లు సీసాలను చూసిన ఆయన వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కలెక్టర్‌కు నివేదిక అందించి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. వార్డెన్‌ను సస్పెండ్ చేయా లంటూ విద్యార్థి సంఘాల నాయకులు హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు. వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.