నీరు లేకుంటే మనిషి లేడు.. జీవరాశి అంతా జలంపైనే ఆధారపడి జీవిస్తోంది. ఇప్పుడు ఈ నీరు గ్రేటర్ వాసులను కలవరపెడుతోంది. నేలను తవ్వితే ఉబికి వచ్చే పాతాళగంగ మహానగరంలో కలుషితమైంది. మూసీ పరీవాహక ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు విషతుల్యంగా మారినట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ భూవిజ్ఙాన శాస్త్ర విభాగంనిపుణులు తేల్చారు. ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో
అధ్యయనం చేయగా భార లోహాలు భారీ స్థాయిలో కరిగి ఉన్నట్టు గుర్తించారు. ప్రధానంగా బాపూఘాట్–ఫీర్జాదీగూడ(44 కి.మీ) మార్గంలో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలనమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించారు. ఆయా నమూనాల్లో కరిగిన ఘన విష పదార్థాలు అధికంగా ఉండడంతో నీటి రంగు పసుపు రంగులోకి మారినట్లు గుర్తించారు. ఈ నీటిలో ప్రమాదకరమైన ఆర్సెనిక్, లెడ్, జింక్‌తో పాటు మెగ్నీషియం, సెలీనియం, బోరాన్ తదితరాల ఆనవాళ్లు కనిపించడంఆందోళన కలిగిస్తోంది.
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌లో భూగర్భ జాలలను ఉపయోగించుకోలేని దుస్థితి నెలకొంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం భూవిజ్ఙాన శాస్త్ర విభాగం నిపుణుల తాజా అధ్యయనం ఇక్కడి నీరు భారలోహాలతో నిండిపోయాయని తేల్చింది. ఈ జలాలు కనీసం బట్టలుతకడం, పెంపుడు జంతువులు దాహార్తి తీర్చుకోవడం, గార్డెనింగ్ వంటి అవసరాలకూ వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మూసీలోకి నిత్యం పారిశ్రామిక వాడల నుంచి వచ్చి చేరుతున్న గరళజలాల్లో భార లోహాల ఉనికి ఉండడం.. కరిగిన ఘన పదార్థాల మోతాదు అధికంగా ఉండడంతో ఈ నీరు భూగర్భంలోకి క్రమంగా ఇంకుతున్న వైనంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని శాస్త్రవేత్తలు తేల్చారు.
జల కాలుష్యం అధికంగాఉన్న ప్రాంతాలు..
భోలక్‌పూర్, ముషీరాబాద్, రాంనగర్, నల్లచెరువు, ఫీర్జాదీగూడ, ఉప్పల్, లంగర్‌హౌజ్, అంబర్‌పేట్, గోల్నాక, చాదర్‌ఘాట్, అఫ్జల్‌గంజ్.
భూగర్భ జలాల్లో ఉన్న భార లోహాలివీ..
సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం, సెలీనియం, బోరాన్, అల్యూమినియం, క్రోమియం, మ్యాంగనీస్, నికెల్, ఆర్సెనిక్, జింక్, లెడ్.
ప్రధాన కారణాలివీ..
⇔ మూసీలోకి దశాబ్దాలుగా పారిశ్రామిక వ్యర్థజలాలు చేరుతున్నాయి. ఈ జలాలు క్రమంగా భూగర్భంలోకి ఇంకుతున్నాయి.
⇔ రోజువారీగా గ్రేటర్‌లో 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో 700 మిలియన్ లీటర్ల నీటినే శుద్ధిచేసి మూసీలోకి వదిలిపెడుతున్నారు.
⇔ మిగతా 700 మిలియన్ లీటర్ల జలాలు ఎలాంటి శుద్ధి కాకుండానే మూసీలో కలుస్తున్నాయి.
⇔ ఇందులో సుమారు 350 మిలియన్ లీటర్ల మేర పారిశ్రామిక వ్యర్థ జలాలున్నాయి. ఈ నీరు క్రమంగా భూగర్భంలోకి చేరుతుండడంతో భూగర్భజలాలు గరళంగా మారాయి.
పారిశ్రామిక వాడల్లో పరిస్థితి ఇదీ..
మహానగరం పరిధిలోని 13 పారిశ్రామికవాడల పరిధిలోని 160 ప్రదేశాల నుంచి భూగర్భ జలాల, చెరువుల నీటి నమూనాలను గతంలో ఎన్‌జీఆర్‌ఐ (జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ) సేకరించి పరీక్షించింది. ప్రధానంగా నాచారం, ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, కాటేదాన్, ఖాజీపల్లి, బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, బొంతపల్లి, పటాన్‌చెరువు, బొల్లారం, పాశమైలారం పారిశ్రామికవాడల పరిధిలో నీటి నమూనాల్లో కరిగిన ఘన పదార్థాలు అధికంగా ఉండడంతో పాటు భారలోహాల ఉనికి బయటపడింది.
మోతాదు మించి ఘన పదార్థాలు
⇔ నాచారం– ఉప్పల్ ప్రాంతాల్లోని నీటి నమూనాలో కరిగిన ఘన పదార్థాల ఉనికి (టీడీఎస్) 1970 మి.గ్రా/లీటర్ నమోదైంది.
⇔ మాల్లాపూర్ ఐడీఏ ప్రాంతంలో నీటి నమూనాలో టీడీఎస్ 1720 ఎంజీ/లీ నమోదైంది.
⇔ చర్లపల్లి ఐడీఏలోని నమూనాలో టీడీఎస్ 2140 ఎంజీ/లీ నమోదైంది.
⇔ కాటేదాన్ ఐడీఏ ప్రాంతాల్లో టీడీఎస్ 1860 ఎంజీ/లీ నమోదైంది.
⇔ బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల ప్రాంతాల్లోని నీటి నమూనాలో టీడీఎస్ 1530 ఎంజీ/లీ నమోదైంది.
⇔ ఖాజీపల్లి ఐడీఏ ప్రాంతాల్లో టీడీఎస్ 1810 ఎంజీ/లీ నమోదైంది.
⇔ బొంతపల్లి ఐడీఏ ప్రాంతాల్లో టీడీఎస్ 1280 ఎంజీ/లీ గా ఉంది.
⇔ పటాన్‌చెరు– బొల్లారం– పాశమైలారం ప్రాంతాల్లోని నీటి నమూనాల్లో టీడీఎస్ 1890 ఎంజీ/లీ నమోదైంది.
⇔ ఎన్‌జీఆర్‌ఐ చేసిన పరీక్షల్లోనూ ఇదే తరహా భారలోహలు ఉన్నట్టు నిర్ధారించింది. అనేక లోహాలు ప్రమాదస్థాయి మించకపోయినా ఏళ్లతరబడి పరిశ్రమల నుంచి విచక్షణారహితంగా విడుదల చేసిన రసాయన వ్యర్థాలకు ఇది నిదర్శమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment