అపెక్స్ కౌన్సిల్ జోక్యం కోరదాం!
Published Wed, Oct 22 2014 2:14 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ఒత్తిళ్లపై కేంద్రం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ జోక్యాన్ని కోరాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కౌన్సిల్‌లో కేంద్ర జల వనరుల మంత్రి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల నీటి పారుదల మంత్రులు సభ్యులుగా ఉంటారు. రాష్ర్ట విభజన చట్టం ప్రకారం ఏపీ విద్యుత్ ప్రాజెక్టుల నుంచి రావాల్సిన 54 శాతం వాటాను న్యాయంగా ఇవ్వకపోగా, తెలంగాణలో విద్యుత్ సంక్షోభం తలెత్తే రీతిలో ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును ఈ కౌన్సిల్ ముందు ఎండగట్టాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే ఈ విషయాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ఈ దిశగా అడుగులేస్తోంది. శ్రీశైలంలో నీటి లోటును కారణంగా చూపుతూ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్‌కేజీ పండిత్ మంగళవారం లేఖ రాయడంతో, ఈ వివాదం బోర్డు పరిధిలో పరిష్కారం కాదనే నిశ్చయానికి రాష్ర్ట ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. శ్రీశైలంలో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఎడమగట్టున విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని, ప్రాజెక్టు నీటి వినియోగంపై గతంలో జారీ చేసిన జీవోలు 69, 170లో పేర్కొన్న నిబంధనలు పాటించాలని ఏపీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే.
తాగు, సాగు నీటి అవసరాలు తీరిన తర్వాతే విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న ఆ నిబంధనలను గుర్తుచేస్తోంది. ఈ వాదనకు బలం చేకూర్చుతూ కృష్ణా బోర్డు కూడా మంగళవారం రాష్ర్ట ప్రభుత్వానికి లేఖ రాసింది. నీటి పారుదల శాఖ ప్రధాన కార్యదర్శికి రాసిన ఈ లేఖపై అర్ధరాత్రి వరకు ఉన్నతాధికారుల స్థాయిలో చర్చోపచర్చలు జరిగాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి సైతం తీసుకెళ్లారు.
Advertisement