ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలలో తెలంగాణ చరిత్రను తొలగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడం దారుణమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలలో తెలంగాణ చరిత్రను తొలగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడం దారుణమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల మధ్య విద్వేషాలు, రెచ్చగొట్టే చర్యలను ఏపీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు విరమించుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.
పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ చరిత్రను తొలగిస్తే ఈ గడ్డమీద ఏపీకి చెందిన వారి విగ్రహాలు, కాలనీలకు, పార్కులకు పేర్లు ఎందుకుండాలని ప్రశ్నించారు. విశాలాంధ్ర కోసం కృషి చేసిన బూర్గుల రామకృష్ణారావు, గిరిజన దేవతలైన సమ్మక్క, సారక్కలతోపాటు హైదరాబాద్‌కు సంబంధించిన అంశాలన్నీ తొలగించాలని పేర్కొనడం దారుణమన్నారు. రెండ్రోజుల్లో ఏపీ ప్రభుత్వం తన చర్యలను ఉపసంహరించుకోకపోతే ప్రతిచర్యలకు దిగుతామన్నారు. ఆంధ్రకు చెందిన వారి పేర్లు, విగ్రహాలు తొలగించాలంటూ సీఎం కేసీఆర్‌కు, జీహెచ్‌ఎంసీలకు లేఖలు రాస్తామన్నారు. ఇక్కడున్న వారి విగ్రహాలను తీసుకెళ్లాలని, అవసరమైతే రాష్ట్ర లారీ అసోసియేషన్‌తో మాట్లాడి రెండున్నర లక్షల లారీలతో రెండు రోజులపాటు ఉచితంగా సర్వీస్ చేయిస్తామన్నారు. ఏపీ ప్రభుత్వ తీరుపై స్పందించని పార్టీల పనిపడతామని హెచ్చరించారు.