ఇరాక్‌లో నరకాన్ని చూశాము | we seen hell in Iraq | Sakshi
Sakshi News home page

ఇరాక్‌లో నరకాన్ని చూశాము

Published Sat, Jun 28 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

ఇరాక్‌లో నరకాన్ని చూశాము

ఇరాక్‌లో నరకాన్ని చూశాము

ఆర్మూర్ : ఇరాక్‌లో ప్రత్యక్ష నరకాన్నే చూసామని పలువురు బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేసారు. మూడు రోజుల క్రితం ఇరాక్‌ను వచ్చిన నిజామాబాద్ జిల్లా సిరికొండకు చెందిన ఈర నరేష్, ఉప్పులూర్‌కు చెందిన ఈర్నాల రవి, గాండ్లపేటకు చెందిన బాలకృష్ణ ప్రవాస భారతీయుల సంక్షేమ, హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడుతో కలిసి ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని గల్ఫ్ బాధితుల సేవా కేంద్రంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఏజెంటు చేతిలో మోసపోయిన తీరు, ఇరాక్‌లో పడ్డ కష్టాలను వివరించారు. నిజామాబాద్‌కు చెందిన రాంగోపాల్‌రెడ్డి అనే ఏజెంటు ఇరాక్‌లో ఉంటున్నాడు. ఇతనికి తెలంగాణ జిల్లాలలో సుమారు 50 మంది సబ్ ఏజెంట్లు ఉన్నారు.
 
అందులో నిజామాబాద్‌కు చెందిన మురళీధర్, అర్గుల్ చారిల ఆధ్వర్యంలో సుమారు 50 మంది ఇటీవల ఇరాక్‌కు కూలీలుగా వెళ్లారు. ప్రతీ ఒక్కరు సబ్ ఏజెంట్లకు రూ. ఒక లక్ష 50 వేల వరకు చెల్లించారు. ఇరాక్‌లో ఆఫీస్‌బాయ్ తదితర తేలిక పాటి పనులకు ప్రతీ నెల రూ. 30 వేల వరకు జీతం వస్తుందని ఏజెంట్లు నమ్మబలికారు. దీంతో అప్పులు చేసి మరీ వారు డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించి ఇరాక్‌కు చేరుకున్నారు. ఇరాక్‌కు వెళ్తే గాని తాము మోసపోయామని తెలియలేదని వారు వాపోయారు. ఇరాక్‌కు చేరుకున్న వారినందరినీ సుమారు 50 మందిని ఒకే హాల్‌లో నిర్బంధించారన్నారు. చెప్పిన పని, జీతం లేకపోగా ఏజెంట్లు తమపై దాడికి సైతం పాల్పడేవారని ఆవేదన వ్యక్తం చేసారు.
 
మార్చి 30న ఇరాక్ వెళ్లిన ఈర నరేష్ మాట్లాడుతూ తనను ఆఫీస్ బాయ్ ఉద్యోగం అని తీసుకెల్లి ఫ్యాక్టరీలో కూలీగా చేర్చారన్నాడు. తాను గ్రామానికి తిరిగి వెల్లిపోతానంటే అదనంగా రూ. 60 వేలు చెల్లించాలని ఇబ్బందులు పెట్టారన్నాడు. ఈర్నాల రవి మే 12న ఇరాక్ వెళ్లగా కంపెనీ విజా కాకుండా విజిట్ విజాపై తీసుకెళ్లారు.  పని లేకపోవడంతో ఇదేంటని ప్రశ్నిస్తే సుమారు రెండు గంటల పాటు తనను బాత్‌రూంలో బంధించారని ఆవేదన వ్యక్తం చేసాడు. బాలకృష్ణ హోటల్‌లో వెయిటర్ పని అని ృెపితే నమ్మి ఏప్రిల్ 11న ఇరాక్‌కు వెళ్లగా అక్కడి లాడ్జిలో ఉంచి పని చూపించకపోవడంతో ఏజెంట్ల బారి నుంచి తప్పించుకొని బయటికి వచ్చానన్నారు. దీంతో ఇరాక్ పోలీలు పట్టుకొని వారం రోజుల పాటు చిత్ర వధ చేసారన్నాడు. తమతో పాటు చాల మంది తెలుగు వారు ఏజెంట్ల మోసం కారణంగా ఇరాక్‌లో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫ్లైట్ టికెట్‌కు డబ్బులున్న వారు తిరిగి వస్తుండగా ఆ డబ్బులు సైతం లేని వారు అక్కడే ఇబ్బందులు పడుతూ ప్రాణ భయంతో బిక్కు బిక్కు మంటున్నారని వివరించారు.  
 
ప్రవాస భారతీయుల సంక్షేమ, హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు మాట్లాడుతూ ఏజంట్ల చేతుల్లో మోసపోయి ఇరాక్‌లో కష్టాలు పడుతున్న తెలుగు వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే వారిని కాపాడాలన్నారు. ఇప్పటికే రెండు నుంచి మూడు వేల మంది తెలుగు వారు ఇరాక్‌లో అంతర్యుద్ధం, ఏజంట్ల మోసాల కారణంగా కష్టాలు పడుతున్నారన్నారు. అధికారులను ఇరాక్‌కు పంపించి బాధితులకు ఉచితంగా విమానం టికెట్లు కొనుగోలు చేసి వారిని స్వస్థలాలకు చేర్చాలని డిమాండ్ చేసారు. భవిష్యత్తులో ఇలాంటి బాధితులను ఆదుకోవడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. ఏజంట్ వ్యవస్థను రద్దు చేసి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నష్టపోయిన వారికి పావలా వడ్డీతో రుణాలు అందజేసి స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.  విలేకరుల సమావేశంలో ప్రవాస భారతీయుల సంక్షేమ, హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు ముత్యాల మనోహన్‌రెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement