తెలంగాణ రాష్ట్రంలో 69 మంది రైతులు ప్రకృతి వైపరీత్యాలు, వరుస కరువు, సామాజిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్యలకు...
- వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేయండి
- తెలంగాణ సర్కారుకు వామపక్షాల సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 69 మంది రైతులు ప్రకృతి వైపరీత్యాలు, వరుస కరువు, సామాజిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ ప్రభుత్వం ప్రకటించటాన్ని పది వామపక్షాలు విమర్శించాయి. శనివారం రాజ్యసభలో ఎంపీ వి.హనుమంతరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మోహన్ కుంధేరియా ఈ మేరకు ఇచ్చిన సమాధానం అసంబద్ధమైందని శనివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తాయి.
దాదాపు 550 మంది ఆత్మహత్యలకు పాల్పడగా, 69 మందేనని మంత్రి ఏ ప్రాతిపదికన నిర్ధారించారో వెల్లడించాలని సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ-యూ, సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ), ఫార్వర్డ్‌బ్లాక్, ఆర్‌ఎస్‌పీ, సీపీఐ(ఎంఎల్), ఎస్‌యూసీఐ-సీ, లిబరేషన్ డిమాండ్ చేశాయి. ఈనెల 5వ తేదీ నుంచి 10 వరకు తమ పార్టీలు రైతు భరోసా బస్సు యాత్రను నిర్వహించి 176 మంది కుటుంబాలను కలుసుకుని, వారి ఆవేదనను తెలుసుకున్నట్లు వివరించాయి.
రైతు ఆత్మహత్యలపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేస్తే తాము సేకరించిన అన్ని ఆధారాలను ప్రభుత్వం ముందు ఉంచుతామని సవాల్ విసిరాయి. కేంద్రం చేసిన ప్రకటన మరింత అపార్ధానికి అవకాశమిస్తుందని హెచ్చరించాయి. తప్పుడు లెక్కలను పంపించి కేంద్రంతో సమాధానం ఇప్పించటం రైతు ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోందని ఆ ప్రకటనలో విమర్శించాయి.
వాస్తవాలను ప్రభుత్వం గుర్తించటానికి నిరాకరించడం అన్యాయమని పేర్కొన్నాయి. తెలంగాణ వస్తే న్యాయం జరుగుతుందనే రైతుల ఆకాంక్ష నిరాశగానే మారిందని అభిప్రాయపడ్డాయి. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారంతోపాటు ఇతర సహాయ చర్యలను ప్రకటించాలని ఈ పార్టీలు విజ్ఞప్తి చేశాయి.