
పంచాయతీలకూ వెబ్‌సైట్‌లు
- నేషనల్ పంచాయత్ పోర్టల్ ద్వారా ఏర్పాటు
- సర్పంచులు, కార్యదర్శులకూ కంప్యూటర్ శిక్షణ
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల సమాచారం త్వరలోనే ఆన్‌లైన్‌లో ప్రతి ఒక్కరికీ సాక్షాత్కారం కానుంది. ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక వెబ్‌సైట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు వెబ్‌సైట్ రూపకల్పన బాధ్యతలను నేషనల్ పంచాయత్ పోర్టల్ విభాగానికి కేంద్ర పంచాయతీరాజ్ విభాగం అప్పగించింది. www.panchayatportals.gov.in ద్వారా వివిధ రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీలు తమ పంచాయతీలకు చెందిన సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేసేలా నేషనల్ పంచాయతీ పోర్టల్స్ వెబ్‌సైట్‌ను డిజైన్ చేసింది.
ప్రధానంగా గ్రామ పంచాయతీల పరిపాలనలో కీలకమైన 13 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని, ఫొటోలను ఎప్పటికప్పుడు ఈ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయవచ్చు. ముఖ్యంగా గ్రామం గురించి, ఎన్నికైన ప్రజాప్రతినిధులు, గ్రామ సభ వివరాలు, బడ్జెట్, పంచవర్ష ప్రణాళిక-నిర్వహణ, కొత్త వార్తలు, అధికారుల టూర్ డైరీ, అధికారుల సమావేశాల్లో చేసిన తీర్మానాలు, చూడదగిన ప్రదేశాలు, మ్యాపులు, రవాణా సదుపాయాలు, పనుల టెండర్లు, ప్రజలకు తెలపాల్సిన సమాచారం.. తదితర అంశాలను పొందుపరిచేలా డిజైన్ చేశారు. అంతే కాకుండా గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసే ఉత్తర్వులు, సర్క్యులర్లు ఆయా గ్రామ పంచాయతీల వెబ్‌సైట్లలోనూ కనిపించేలా ఏర్పాట్లు చేశారు.
ప్రజాప్రతినిధులకు కంప్యూటర్ శిక్షణ
గ్రామ పంచాయతీల వెబ్‌సైట్ నిర్వహణ, గ్రామానికి సంబంధించిన వివిధ అంశాలను అప్‌లోడ్ చేయడం, పరిపాలనకు సంబంధించిన వివరాల నమోదు.. తదితర అంశాలపై గ్రామ సర్పంచులతో పాటు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కేంద్ర పంచాయతీరాజ్ విభాగం అందిస్తోన్న ఈ శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా 10,994 మంది డిగ్రీ చదువుకున్న ప్రజాప్రతినిధులను ప్రభుత్వం ఎంపిక చేసింది.
వీరిలో 3,351 మంది సర్పంచులు, 3,300 మంది పంచాయతీ కార్యదర్శులు, 366 మంది జడ్పీటీసీలు, 4,277 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఈనెల 29న ప్రారంభమైన తొలివిడత శిక్షణకు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇస్తుండగా, మలివిడతలో ఎంపీటీ సీలకు, జెడ్పీటీసీలకు శిక్షణ ఇవ్వనున్నారు. తమిళనాడుకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. గ్రామ పంచాయతీల పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు వెబ్‌సైట్(ఆన్‌లైన్) వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని, ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.