
స్ట్రెచర్‌పై నుంచే తాళి కట్టిన వేళ..!
వరంగల్, న్యూస్‌లైన్: అందమైన పెళ్లిపందిరి.. మేళతాళాలతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ వరుడు రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరాడు. మంచంపై నుంచి లేవలేని దయనీయ పరిస్థితి అతనిది. అయినా ఆ పెళ్లి అనుకున్న ముహూర్తానికే జరిగి ఆనందాన్ని పంచుకున్న సంఘటన వరంగల్ జిల్లా ఉర్సు నాగమయ్య గుడిలో శనివారం జరిగింది. గూడూరు మండలం నాయక్‌పల్లికి చెందిన గోపిశెట్టి పెద్ద మల్లయ్య కుమారుడు శ్రీనివాస్‌కు నెల్లికుదురు మండలం రామన్నగూడెంకు చెందిన పుప్పాల లింగయ్య కుమార్తె సౌజన్యతో పెళ్లి కుదిరింది.
శనివారం ఉదయం 8.30 గంటలకు ముహూర్తం పెట్టుకున్నారు. వివాహ పనుల్లో భాగంగా వరుడు శ్రీనివాస్ ఆహ్వాన పత్రికలు పంచేందుకు గతనెల 30న కేసముద్రం వెళ్లాడు. తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని కాలు విరిగింది. శ్రీనివాస్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అయితే శనివారం పెళ్లి ముహూర్తం సమయానికి శ్రీనివాస్‌ను ఆస్పత్రి నుంచి అంబులెన్సులో నేరుగా ఉర్సు సుభాష్‌నగర్ నాగమయ్యగుడి వద్దకు స్ట్రెచర్‌పై తీసుకొచ్చారు. స్ట్రెచర్‌పైనుండే వధువు సౌజన్య మెడలో తాళి కట్టాడు. వివాహం అనంతరం నూతన వధూవరులు అంబులెన్స్‌లో అస్పత్రికి వెళ్లారు.