అవిభక్త కవలలు వీణ,వాణిలను విడదీసే శస్త్రచికిత్సకు లండన్‌లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రి వైద్య బృందం ముందుకొచ్చిన నేపథ్యంలో...
- వీణ,వాణిల శస్త్ర చికిత్సపై ఎయిమ్స్‌కు లేఖ రాయనున్న సర్కార్
సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణ,వాణిలను విడదీసే శస్త్రచికిత్సకు లండన్‌లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రి వైద్య బృందం ముందుకొచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) అభిప్రాయం కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వారికి లేఖ రాయనుంది. శస్త్రచికిత్సలో అనేక సంక్లిష్ట అంశాలున్నందున ఎయిమ్స్ దృష్టికి తీసుకెళ్లడం తప్పనిసరని సర్కారు అభిప్రాయపడుతోంది.
ఎయిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ అయినందున వైద్య పరమైన అంశాలకు సంబంధించిన అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ప్రభుత్వ ఆలోచన. లండన్ ఆసుపత్రి విషయంలో ముందుకు వెళ్లాలా? వద్దా? అక్కడ ఏ మేరకు సక్సెస్ రేటు ఉంటుంది? లండన్‌లోనే చేయించాలా? లేక ఇంకా ఎక్కడైనా చేయించే అవకాశం ఉందా? ఇలాంటి అంశాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లండన్ ఆసుపత్రి నుంచి వచ్చిన సమ్మతి లేఖ శుక్రవారం ఆర్థిక శాఖకు చేరింది.