సుల్తాన్‌బజార్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అక్రమంగా కబ్జాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న 9మంది తెలంగాణ విద్యార్థులపై పెట్టిన కేసులను భేషరతుగా ఎత్తివేయాలని వివిధ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎం.మహేశ్, అజాద్(టీవీవీ), పోక శ్రీనివాస్(టీవీఎస్), బద్రి (డీఎఫ్‌ఈ), చిక్కుడు ప్రభాకర్( తెలంగాణ ప్రజాఫ్రంట్)లు మాట్లాడారు. కబ్జాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించి జైల్‌లో నిర్భంధించడం తెలంగాణ వాదులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారన్నారు.
వందల సంవత్సరాల చరిత్ర గల ఓయూ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి పంపిణీ చేస్తామని కేసీఆర్ ఓయూ వైస్‌ఛాన్స్‌లర్ ఇతరుల అభిప్రాయం తీసుకోకుండా ఓ నియంతలా నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. ఓయూలో కబ్జాకు గురైన భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉన్నత విద్యను అందించకుండా కేసీఆర్ ఓయూ భూముల్లో పేదలకు ఇళ్లు కేటాయిస్తామని కుట్రకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఎన్నికల్లో విద్యార్థులకు, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చి ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీ చేయకుండా అన్యాయం చేస్తున్నారని అన్నారు. అక్రమ కేసులు బనాయించిన ఓయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని, లేని పక్షంలో మరో ఉద్యమం తప్పదన్నారు.
ఓయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి
Published Thu, May 28 2015 11:30 PM | Last Updated on Fri, Nov 9 2018 4:10 PM
Advertisement