గత ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కాలువలు తవ్వినా రిజర్వాయర్లు నిర్మించలేదని..
♦ కాలువలు తవ్వినా రిజర్వాయర్లు కట్టలేదు: కేసీఆర్
♦ రిజర్వాయర్ల కోసం భూసేకరణ చేయండి
♦ సత్వరమే బాధితులకు పరిహారం ఇవ్వాలి
♦ వరంగల్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష
సాక్షి, హన్మకొండ: గత ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కాలువలు తవ్వినా రిజర్వాయర్లు నిర్మించలేదని.. దానివల్ల ఆ ప్రాజెక్టులు అక్కరకు రాకుండా పోయానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందువల్లే తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా దేవాదుల, దుమ్ముగూడెం తదితర ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేస్తోందని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పలు సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం వరంగల్‌లో సీఎం సమీక్షించారు. గత ప్రభుత్వాల హయాంలో దేవాదుల పథకం కింద రిజర్వాయర్లు లేకుండానే కాలువలు తవ్వారని, ఇప్పుడు ఆ కాల్వలన్నీ ఉపయోగంలోకి వచ్చేలా రిజర్వాయర్లు నిర్మిస్తామన్నారు.
వాటికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ఎస్సారెస్పీని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు అవసరమైతే మరిన్ని రిజర్వాయర్లు నిర్మించేందుకు సిద్ధమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై త్వరలోనే మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. మిషన్ భగీరథ తొలి విడతలో వరంగల్ జిల్లా జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో, మెదక్ జిల్లా గజ్వేల్, సిద్ధిపేట, దుబ్బాక, నల్లగొండ జిల్లా ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాల్లో రాబోయే నాలుగు నెలల్లోనే ప్రతీ ఇంటికి మంచి నీరు అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
పైప్‌లైన్ల ఏర్పాటుతో పాటు ఇతర పనులు సమాంతరంగా జరగాలని... ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతీ వారం సమావేశమై కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. చెరువుల భూములను కాపాడడానికి సర్వేలు చేసి హద్దులు నిర్ణయిస్తామన్నారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలతో సర్వే చేయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చెరువుల పునరుద్ధరణ, హద్దుల నిర్ణయంలో ఆయకట్టు దారులను భాగస్వాములను చేయాలన్నారు. ఇక అతిపెద్ద గిరిజన జాతర అయిన ‘సమ్మక్క-సారలమ్మ’ విశేషాలతో రాష్ట్ర ప్రభుత్వం రూపొం దించిన medaramjathara.comవెబ్‌సైట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.