ఎంజీబీఎస్ నుంచి మణెమ్మను 108లో తరలిస్తున్న దృశ్యం
సుల్తాన్‌బజార్: కాన్పు కోసం నగరంలోని ఆస్పత్రిలో చేరేందుకు వచ్చిన ఓ మహిళ ఇమ్లీబన్ బస్‌స్టేషన్‌లోనే ప్రసవించింది. సడన్‌గా నొప్పులు రావడంతో బస్టాండ్ ఆవరణలోనే ఆర్టీసీ సిబ్బంది సాయంతో ఆమెకు పురుడు పోశారు. దీంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివరాలిలా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తాలూకా అమ్రాబాద్ గ్రామానికి చెందిన చెంచు మణెమ్మ, ఈదయ్య దంపతులు. మణెమ్మ కాన్పు కోసం ఆదివారం తన తల్లితో కలిసి నగరంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా...ప్రతి నెల చెకప్, స్కానింగ్ సంబంధిత రిపోర్టులు లేవన్న కారణంతో అక్కడి వైద్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోలేదు. దీంతో నిరాశతో వెనుదిరిగి..ఊరికి వెళ్లేందుకు ఎంజీబీఎస్‌కు వచ్చారు.
అదే సమయంలో ఆమెకు నొప్పులు వచ్చాయి. పరిస్థితి గమనించిన ఆర్టీసి అధికారులు, సిబ్బంది బ్లాంకెట్‌లను తెప్పించి ఆమె చుట్టూ ఏర్పాటు చేశారు. మహిళా సిబ్బంది, తల్లి సహాయంతో మణెమ్మ మగ శిశువుకు జన్మినిచ్చింది. అనంతరం ఆర్టీసి అధికారులు, సిబ్బంది ఇచ్చినసమాచారంతో అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది వైద్యం నిమిత్తం ఆమెను ప్రభుత్వ పేట్ల బురుజు ఆసుపత్రికి తరలించారు. అయితే వారి వద్ద డబ్బులు లేకపోవడంతో కల్వకుర్తి ఏడీసీజి.ఆర్.రెడ్డి, ఎంజీబీఎస్ కంట్రోలర్లు, సిబ్బంది కలిసి కొంత నగదు అందజేసి మానవత్వాన్నిచాటుకున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment