యాదాద్రి పాలక మండలికి నోటిఫికేషన్ | Yadadri ruling Council Notification | Sakshi
Sakshi News home page

యాదాద్రి పాలక మండలికి నోటిఫికేషన్

Published Sat, May 23 2015 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

Yadadri ruling Council Notification

భువనగిరి : ఆరు సంవత్సరాలుగా అడ్రస్‌లేకుండా పోయిన యాదగిరిగుట్ట దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకానికి ఎట్టకేలకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే వలిగొండ మండలంలోని వేములకొండ మత్స్యగిరి లక్ష్మీనర్సింహస్వామి పాలక మండలి సభ్యుల నియామకానికి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఔత్సాహికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. యాదగిరిగుట్ట ధర్మ కర్తల మండలి పదవీ కాలం 2009 నవంబర్ 18 న ముగిసింది. అయితే గత ప్రభుత్వంలో అడ్రస్‌లేకుండా పోయిన పాలకవర్గ నియామకం కోసం ఫిబ్రవరి 14 న జీఓనంబర్ 221ని జారీ చేశారు. దీని ఆధారంగా శుక్రవారం నోటిఫికేషన్ వెలువడింది. నోటిఫికేషన్ జారీ అయిన 20 రోజులలోపు ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ప్రభుత్వం వాటిని పరిశీలించి ధర్మకర్తలను నామినేట్ చేస్తుంది.
 
 సేవాగుణం, సచ్చీలత ఆధారంగానే..
 నిజాం కాలం నుంచి ధర్మకర్తల నియామకం ప్రారంభమైంది. 1966లో దేవాదాయ చట్టం రూపొందించారు. ఈ ఆలయానికి వంశపారం పర్య ధర్మకర్త పాలకమండలి చైర్మన్‌గా ఉంటారు. అందువల్ల ఈ చట్టం ప్రకారం మరో 8మంది సభ్యులను ప్రభుత్వం నియమించనుంది. యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి కోసం వైటీడీఏ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ తనే చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే దేవస్థానం ధర్మకర్తల మండలి ఎంపిక కూడా ఆయనే స్వయంగా చేయనున్నారు. ఈ విషయంలో ఆధ్యాత్మికత, సేవాగుణాలు, సచ్చీలత  వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోనున్నారు.
 
  ఒక ధర్మ కర్త స్థానాన్ని ఎస్సీ,ఎస్టీ, బలహీనవర్గాలకు తప్పనిసరి కేటాయించాలి. వీరి పదవీ కాలం రెండు సంవత్సరాలు ఉంటుంది. ధర్మకర్తల ఎంపికలో ఇద్దరు స్థానికులను నియమించే అవకాశం ఉంది. మిగతా ఆరు స్థానాలను మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా నియమించే అవకాశం ఉంది. సీఎం  వైటీడీఏ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టిపెట్టి నందున ధర్మకర్తల నియామకంపై కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారనడంలో సందేహం లేదు. పూర్తిగా నామినేటెడ్ పదవులు అయినప్పటికీ ఆ పదవికి మరింత గౌరవాన్ని  తెచ్చే వారిని ఎంపిక చేయాలని  భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే,ఎంపీ, జిల్లాకు చెందిన మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ధర్మ కర్తల నియామకంలో కీలకపాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి.
 
 పైరవీలు ముమ్మరం
 ధర్మకర్తల నియామకం కోసం నోటిఫికేషన్ రావడంతో ఔత్సాహికుల్లో ఆసక్తి పెరిగింది. తమకు ధర్మకర్త పదవి ఇప్పించాలని పలువురు పైరవీలు ముమ్మరం చేశారు.  మరో 20 రోజులు ఉండడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement