
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ‘శక్తి’ యాప్‌లో కార్యకర్తలు తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలని ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల కార్యకర్తలంతా ఓటర్ ఐడీ నంబర్‌ను 7996179961కు ఎస్‌ఎంఎస్ చేసి యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. రాహుల్ ఆదేశాల మేరకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, బూత్ స్థాయి కార్యకర్తలంతా జూన్ 15 లోపు రిజిస్టర్ చేసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు.
రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌ల వారీ గా కార్యకర్తలను టెక్నాలజీతో అనుసంధానం చేస్తున్న పార్టీ.. తాజాగా కార్యకర్తలను ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేస్తోంది. దీనికి ‘శక్తి’పేరుతో ప్రత్యేకంగా యాప్ రూపొందించి అన్ని స్థాయిల్లోని కార్యకర్తల వివరాలను నమోదు చేస్తోంది. యాప్ ద్వారా పార్టీకి సంబంధించిన సమాచారం సులువుగా కార్యకర్తలకు చేరవేయొచ్చని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో యాప్ ద్వారా కార్యకర్తల నమోదు మొదలవగా తెలంగాణలోనూ వెంటనే ప్రారంభించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు అందాయి.